PM tour
-
తెలంగాణలో రాచరిక పాలన నడుస్తోంది: కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తే ప్రభుత్వం మర్యాద పాటించలేదని, దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదన్నారు. కుటుంబ పాలనలో తెలంగాణ రాష్ట్రం బందీ అయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా బేగంపేటలో నిర్వహించిన సభలో మాట్లాడారు. ‘తెలంగాణ ప్రభుత్వానికి కనీస మర్యాద లేదు. ప్రధాని తెలంగాణకు వస్తే ప్రభుత్వం మర్యాద పాటించలేదు. దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్‌ది నిజాం రాజ్యాంగం. సీఎం కేసీఆర్ వైఖరితో తెలంగాణకు నష్టం జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రికి అభివృద్ధి పట్టదు. తెలంగాణ.. కుటుంబ పాలనలో బందీ అయ్యింది. రాష్ట్రంలో కుటుంబ, రాచరిక పాలన నడుస్తోంద’ అని తీవ్ర విమర్శలు గుప్పించారు కిషన్ రెడ్డి. ఇదీ చదవండి: తెలంగాణ రామగుండంలో ప్రధాని మోదీ పర్యటన.. కీలక అప్డేట్స్ -
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఇలా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. ఇప్పటికే మోదీ పర్యటనపై పలు చోట్ల నిరసనలు, నో ఎంట్రీ అంటూ ఫ్లెక్సీలు వంటివి కనిపించాయి. అయితే, ఇదంతా టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ కుట్రగా ఆరోపించింది బీజేపీ. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటన ముగించుకుని మధ్యాహ్నానికి తెలంగాణ చేరుకోనున్న మోదీ.. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రానికి సుడిగాలి పర్యటన ముగించుకుని తిరిగి ఢిల్లీ వెళ్లిపోనున్నారు. ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులపై మోదీ ఎలాంటి కామెంట్స్ చేస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తెలంగాణలో మోదీ పర్యటన వివరాలు.. ► మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. ► మధ్యాహ్నం 1.40 నుంచి 2 గంటల వరకు ఎయిర్ పోర్ట్ బయట పబ్లిక్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు. ► 2.15 గంటలకు రామగుండం బయలుదేరతారు. ► 3.30 నుంచి 4 గంటలకు RFCL ప్లాంట్ సందర్శిస్తారు. ► 4.15 నుంచి 5.15 వరకు రామగుండంలో నిర్వహించే సభలో మాట్లాడతారు. ► 5.30కు రామగుండం నుంచి బేగంపేట బయలుదేరుతారు మోదీ. ► 6.35కు బేగంపేట చేరుకుంటారు. ► 6.40కి బేగంపేట నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు మోదీ. ఇదీ చూడండి: మోదీ రాక.. రాష్ట్రంలో కాక.. 'మునుగోడు' వేడి చల్లారకముందే.. -
‘మోదీ పర్యటనపై కేసీఆర్‌కు కడుపు మంట ఎందుకు?’
న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను అడ్డుకుంటామనే హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు బీజేపీ ఎంపీ, డాక్టర్ లక్ష్మణ్. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే ప్రధాని పర్యటన అడ్డుకుంటామని కేసీఆర్ అంటున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, ఆశలను కేసీఆర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈనెల 11, 12వ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని హాజరవుతున్నారని స్పష్టం చేశారు. తెలంగాణలోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించనున్నారని ఢిల్లీలో విలేకరుల సమావేశంలో తెలిపారు. ‘కేంద్ర నిధుల సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు ప్రధాని. బీజేపీని, మోదీని రాజకీయంగా ఎదుర్కోలేక తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నిలబెట్టుకోవడం లేదు. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే ప్రధాని పర్యటన అడ్డుకుంటామని కేసీఆర్ అంటున్నారు. తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేస్తున్నారు. తెలంగాణలో కుటుంబ, అవినీతి పనులను ఎదుర్కొనే సామర్థ్యం బీజేపీకి ఉన్నది.. అందుకే మునుగోడులో 40శాతం ఓట్లు బీజేపీకి వేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రూ. 6,000 కోట్ల పైచిలుకు నిధులతో పునరుద్ధరించారు. దాన్ని జాతికి అంకితం చేసేందుకు ప్రధాని వస్తుంటే అడ్డుకుంటామని అంటున్నారు. లెఫ్ట్ పార్టీలో నేతలు కేసీఆర్ కనుసనల్లో ఉన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఎరువుల కర్మాగారం ఓపెన్ చేస్తుంటే కేసీఆర్‌కి వచ్చిన కడుపు మంట ఏంటి? తెలంగాణను విత్తన భాండాగారంగా మారుస్తామని కేసీఆర్ చెప్పారు ఏమైంది? హింసను పేరేపించే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. అందులో కమ్యూనిస్టులు చలి కాల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఇదీ చదవండి: రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రొటోకాల్ రగడ!.. కేసీఆర్‌ను పిలవరా? -
ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరం
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ శనివారం చేపట్టిన ఒకరోజు రాష్ట్ర పర్యటనకు సీఎం కేసీఆర్ పూర్తి దూరం పాటించారు. ముఖ్యమంత్రి స్వల్ప జ్వరంతో బాధపడుతుండటంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలికే కార్యక్రమంతోపాటు మోదీ పాల్గొన్న ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు, ముచ్చింతల్‌లో రామానుజ విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు హాజరుకాలేదని సీఎం కార్యాలయం వివరణ ఇచ్చింది. అయితే ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ విధానాల పై విరుచుకుపడుతున్న సీఎం కేసీఆర్ మోదీ పర్యటనకు దూరంగా ఉండటం వ్యూహాత్మకమేననే చర్చ జరుగుతోంది. శనివారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రధాని మోదీకి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితోపాటు పలువురు బీజేపీ నేతలు ఆహ్వానం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర పశు సంవర్దక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తోపాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర ఉన్నతా ధికారులు స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ప్రధాని వెంట కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, నరేంద్రసింగ్ తోమర్‌తోపాటు గవర్నర్ తమిళిసై ఇక్రిశాట్‌కు చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మంత్రులు కె. తారక రామారావు, నిరంజన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని ప్రొటోకాల్ మేరకు ఆహ్వానించారు. అయితే కొత్త ప్రభాకర్‌రెడ్డి కుమారుడి వివాహం ఉండటంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయినట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇక్రిశాట్ స్వర్ణోత్సవంలో పాల్గొన్న అనంతరం ప్రధాని ప్రత్యేక హెలికాప్టర్లో ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి చేరుకున్నారు. ప్రధాని వెంట గవర్నర్‌తోపాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెళ్లగా త్రిదండి చిన్నజీయర్ స్వామి, మై హోం ఎండీ రామేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు స్వాగతం పలికారు. ముచ్చింతల్‌లో జరిగిన కార్యక్రమంలోనూ రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర నేతలెవరూ పాల్గొనలేదు. రాష్ట్ర పర్యటన పూర్తి చేసుకొని శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరిగి ఢిల్లీ బయలుదేరిన ప్రధానికి ఎంపీ రంజిత్‌రెడ్డి, మంత్రి తలసాని, ఎంపీ సీఎం రమేశ్ వీడ్కోలు పలికారు. సంజయ్‌కు ఆత్మీయ పలకరింపు.. ఈటలకు ప్రశంస హైదరాబాద్ పర్యటన సందర్భంగా పలువురు రాష్ట్ర బీజేపీ నాయకులను ప్రధాని ఆప్యాయంగా పలకరించారు. వారి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఇక్రిశాట్, ముచ్చింతల్లలో తనకు స్వాగతం, వీడ్కోలు పలికేందుకు వచ్చిన 50–60 మంది రాష్ట్ర నాయకులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను మోదీకి పరిచయం చేస్తూ ‘‘హోరాహోరీగా సాగిన హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ను ఓడించారు’’అని పేర్కొన్నారు. దీంతో ఈటల భుజంతట్టి ప్రధాని ప్రశంసించారు. అనంతరం ‘‘సంజయ్ బండి జీ... ఎలా ఉన్నారు? ఏమిటి విశేషాలు? అంతా బాగే కదా’’అని ఎంపీ బండి సంజయ్‌ను ప్రధాని నవ్వుతూ పలకరించారు. -
నేడు నగరానికి ప్రధాని మోదీ
సాక్షి, విశాఖపట్నం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖ పర్యటనకు శుక్రవారం వస్తున్నారు. ఆయన ప్రధాని హోదాలో విశాఖ రావడం ఇది రెండోసారి. 2014 అక్టోబర్‌లో హుద్‌హుద్ తుపాను అనంతరం నష్టతీవ్రతను తెలుసుకునేందుకు తొలిసారిగా నగరానికి వచ్చారు. అంతకుముందు 2014 ఎన్నికల ప్రచారసభలో ప్రధాని అభ్యర్థిగా పాల్గొన్నారు. తొలుత ఫిబ్రవరి 16న విశాఖలో ప్రధాని సభ జరుగుతుందని ప్రకటించారు. అనంతరం అది 27వ తేదీకి వాయిదా పడింది. ఆ తర్వాత మార్చి ఒకటో తేదీకి మార్పు జరిగింది. మొదట్లో ప్రధాని మోదీ ప్రజాచైతన్య సభను ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించాలని బీజేపీ నేతలు భావించారు. ప్రధాని సభకు ఈ మైదానం ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించలేదంటూ ఏయూ అధికారులు తిరస్కరించారు. దీంతో ఈ సభను రైల్వే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. కాగా ప్రధాని మోదీ తమిళనాడులోని కన్యాకుమారి నుంచి నేరుగా సాయంత్రం 6.20 గంటలకు విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి 6.45 గంటలకు నగరంలో సభ జరిగే రైల్వే గ్రౌండ్స్‌కు వస్తారు. 6.55కి వేదికపైకి చేరుకుంటారు. 7 గంటలకు విశాఖ ఎంపీ కె.హరిబాబు, 7.10కి పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ప్రసంగం ఉంటాయి. రాత్రి 7.20 నుంచి 8 గంటల వరకు 40 నిమిషాల సేపు సభనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. 8.05 గంటలకు రైల్వే ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి విమానాశ్రయానికి బయలుదేరతారు. 8.30 గంటలకు ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనమవుతారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇప్పటికే సభా ప్రాంతాన్ని ఎస్పీజీ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రధాని భద్రతను పది మంది ఎస్పీ ర్యాంకు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. దేశ సరిహద్దులో నెలకొన్న యుద్ధవాతావరణం నేపథ్యంలో ప్రధానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి సభా ప్రాంగణం వరకు వచ్చే కాన్వాయ్‌లో 20 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అనుసరిస్తాయి.ప్రధానమంత్రి కోసం ప్రత్యేకంగా ఒక బులెట్‌ప్రూఫ్ వాహనాన్ని ఢిల్లీ నుంచి రప్పిస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ విశాఖ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. శుక్రవారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకుంటారు. బహిరంగ సభ జరిగే ప్రాంతాన్ని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మురళీధరన్, సహ ఇన్చార్జి సునీల్ దేవధర్‌లతో పాటు ఎంపీ హరిబాబు, ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్, నాయకులు సాగి కాశీవిశ్వనాధరాజు, సురేంద్ర, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ బాలరాజేశ్వరరావు, వివేకానందరెడ్డి, ఆ పార్టీ నాయకులు గురువారం సాయంత్రం పరిశీలించారు. అజ్ఞాత ఫ్లెక్సీలు.. ప్రధాని మోదీ విశాఖ వస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు నగరంలో ‘వియ్ వాంట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ఏపీ’ అని రాసిన నల్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాటిపై ఎక్కడా ఆ పార్టీ నాయకుల పేర్లు లేకుండా జాగ్రత్త పడ్డారు. ఈ ఫ్లెక్సీల కోసం రూ.20 లక్షలు Ððవెచ్చించినట్టు తెలుస్తోంది. ఈ సంగతి తెలుసుకున్న బీజేపీ నాయకులు గురువారం సాయంత్రం వాటిని కొన్నిచోట్ల తొలగించారు. -
మోదీ పర్యటనలో సిద్దిపేట మార్క్
సిద్దిపేట నీటిపథకం స్ఫూర్తిగా మిషన్ భగీరథకు రూపకల్పన సాకారం కానున్న సిద్దిపేట రైల్వే మార్గం ఈ రెండింటికీ సిద్దిపేటతో బంధం సిద్దిపేట జోన్: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం నాటి గజ్వేల్ మండలం కోమటిబండ పర్యటనలో సిద్దిపేట మార్క్ కన్పిస్తోంది. జిల్లాకు చెందిన మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ మార్గానికి శంకుస్థాపనతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పైలాన్‌ను ప్రధాని ఆవిష్కరించనున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు సిద్దిపేటకు దగ్గరి సంబంధం ఉంది. నాడు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం కేసీఆర్ నియోజకవర్గ ప్రజల దాహార్తిని శాశ్వతంగా పరిష్కరించే దిశగా చేపట్టిన గ్రామీణ శాశ్వత మంచి నీటి పథకాన్ని చేపట్టారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకునే మిషన్ భగీరథ పథకానికి రూపకల్పన చేశారు. మరోవైపు గత మూడు దశాబ్దాలుగా సిద్దిపేట ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం రైల్వేలైన్. మార్గానికి మోదీ శంకుస్థాపన చేయడం ద్వారా మరింత మోక్షం లభించనుంది. రైల్వేలైన్ మూడు దశాబ్దాల కల సిద్దిపేట రైల్వేలైన్ ఈ ప్రాంత వాసుల మూడు దశాబ్దాల నాటి కల. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాం నుంచి నేటి ప్రధాని నరేంద్రమోదీ వరకు సిద్దిపేట నియోజకవర్గ ప్రజల్లో బలంగా నాటుకున్న రైల్వేలైన్ ఆశలకు ఆదివారం నాటి ప్రధాని పర్యటనతో కొంత బలం చేకూరిందనే చెప్పాలి. హైదరాబాద్, కరీంనగర్‌లకు అనుసంధానంగా తూప్రాన్ మండలం మనోహరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి సిద్దిపేట మీదుగా రైల్వేమార్గాన్ని అనుసంధానం చేస్తూ 1999లో కేంద్ర ప్రభుత్వానికి రూ.328 కోట్లతో 151 కిలోమీటర్ల ప్రతిపాదనలతో నూతన మార్గానికి ఓ అడుగు పడింది. ఈ క్రమంలోనే 2005లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్ అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంతో మనోహరాబాద్-కొత్తపల్లి మార్గానికి అంకురార్పణ జరిగింది. సాక్షాత్తు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్న సిద్దిపేట రైల్వేలైన్ మార్గం భవిష్యత్తులో మరింత వేగవంతంగా ముందుకు సాగి సిద్దిపేట వాసుల మూడు వసంతాల కలకు మార్గం మరింత సుగమమైందనే చెప్పాలి. సిద్దిపేట పథకం రాష్ట్రానికే ఆదర్శం తీవ్ర నీటి ఎద్దడితో కొట్టుమిట్టాడుతున్న సిద్దిపేట నియోజకవర్గ ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చింది మానేరు మంచినీటి పథకం. ఈ పథకం నుంచే మిషన్ భగీరథకు రూపకల్పన జరిగింది. కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సరిగ్గా 16 ఏళ్ల క్రితం కరీంనగర్ జిల్లా మానేరు డ్యాం నుంచి వ్యయప్రయాసాలకోర్చి 58 కిలో మీటర్ల దూరంలోని ఎల్ఎండీ ద్వారా నియోజకవర్గంలోని 144 గ్రామాలకు నిత్యం తాగునీటిని సరఫరా చేసి పథకానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని మూడు మండలాలతోపాటు సమీపంలోని దుబ్బాక నియోజకవర్గంలోని పలు గ్రామాలకు, సిద్దిపేట మున్సిపల్‌కు నిత్యం మానేరు నీటిని అందిస్తున్నారు. గత కొన్నేళ్లుగా సత్ఫలితాలను అందిస్తున్న సిద్దిపేట మానేరు నీటి పథకాన్ని స్ఫూర్తిగా తీసుకున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పద్ధతిలో నీటిని అందించేందుకు మిషన్ భగీరథకు రూపకల్పన చేశారు. అందులో తొలి ప్రయోగంగా గజ్వేల్ నియోజకవర్గంలో మిషన్ భగీరథను అమలుకు శ్రీకారం చుట్టారు. సిద్దిపేటకు గర్వకారణం నాడు సిద్దిపేట ముద్దబిడ్డగా కేసీఆర్ ఈ నియోజకవర్గ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన తాగునీటి పథకం నేడు రాష్ట్రానికి మిషన్ భగీరథ రూపంలో ముందుకు రావడం గర్వకారణం. తెలంగాణలోని ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి తాగునీటిని అందించే లక్ష్యం ఎంతో గొప్పది. అదే విధంగా సిద్దిపేట వాసుల చిరకాల స్వప్నం రైల్వేలైన్ మార్గానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడం శుభసూచకం. రైల్వేమార్గం పనులు వేగవంతానికి ప్రధాని పర్యటన దోహదపడనుంది. ఆదివారం నాటి కార్యక్రమంలో సిద్దిపేటకు చెందిన రెండు మహత్తర కార్యక్రమాలకు చోటు లభించడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో అనందం. - హరీశ్‌రావు, రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి