సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బారికేడ్లు
సాక్షి, విశాఖపట్నం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖ పర్యటనకు శుక్రవారం వస్తున్నారు. ఆయన ప్రధాని హోదాలో విశాఖ రావడం ఇది రెండోసారి. 2014 అక్టోబర్‌లో హుద్‌హుద్ తుపాను అనంతరం నష్టతీవ్రతను తెలుసుకునేందుకు తొలిసారిగా నగరానికి వచ్చారు. అంతకుముందు 2014 ఎన్నికల ప్రచారసభలో ప్రధాని అభ్యర్థిగా పాల్గొన్నారు. తొలుత ఫిబ్రవరి 16న విశాఖలో ప్రధాని సభ జరుగుతుందని ప్రకటించారు. అనంతరం అది 27వ తేదీకి వాయిదా పడింది.
ఆ తర్వాత మార్చి ఒకటో తేదీకి మార్పు జరిగింది. మొదట్లో ప్రధాని మోదీ ప్రజాచైతన్య సభను ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించాలని బీజేపీ నేతలు భావించారు. ప్రధాని సభకు ఈ మైదానం ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించలేదంటూ ఏయూ అధికారులు తిరస్కరించారు. దీంతో ఈ సభను రైల్వే ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. కాగా ప్రధాని మోదీ తమిళనాడులోని కన్యాకుమారి నుంచి నేరుగా సాయంత్రం 6.20 గంటలకు విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి 6.45 గంటలకు నగరంలో సభ జరిగే రైల్వే గ్రౌండ్స్‌కు వస్తారు. 6.55కి వేదికపైకి చేరుకుంటారు. 7 గంటలకు విశాఖ ఎంపీ కె.హరిబాబు, 7.10కి పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ప్రసంగం ఉంటాయి. రాత్రి 7.20 నుంచి 8 గంటల వరకు 40 నిమిషాల సేపు సభనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. 8.05 గంటలకు రైల్వే ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి విమానాశ్రయానికి బయలుదేరతారు. 8.30 గంటలకు ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనమవుతారు.
కట్టుదిట్టమైన భద్రత నడుమ
ఇప్పటికే సభా ప్రాంతాన్ని ఎస్పీజీ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రధాని భద్రతను పది మంది ఎస్పీ ర్యాంకు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. దేశ సరిహద్దులో నెలకొన్న యుద్ధవాతావరణం నేపథ్యంలో ప్రధానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి సభా ప్రాంగణం వరకు వచ్చే కాన్వాయ్‌లో 20 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అనుసరిస్తాయి.ప్రధానమంత్రి కోసం ప్రత్యేకంగా ఒక బులెట్‌ప్రూఫ్ వాహనాన్ని ఢిల్లీ నుంచి రప్పిస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ విశాఖ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. శుక్రవారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకుంటారు. బహిరంగ సభ జరిగే ప్రాంతాన్ని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధరన్, సహ ఇన్‌చార్జి సునీల్ దేవధర్‌లతో పాటు ఎంపీ హరిబాబు, ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్, నాయకులు సాగి కాశీవిశ్వనాధరాజు, సురేంద్ర, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ బాలరాజేశ్వరరావు, వివేకానందరెడ్డి, ఆ పార్టీ నాయకులు గురువారం సాయంత్రం పరిశీలించారు.
అజ్ఞాత ఫ్లెక్సీలు..
ప్రధాని మోదీ విశాఖ వస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు నగరంలో ‘వియ్ వాంట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ఏపీ’ అని రాసిన నల్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాటిపై ఎక్కడా ఆ పార్టీ నాయకుల పేర్లు లేకుండా జాగ్రత్త పడ్డారు. ఈ ఫ్లెక్సీల కోసం రూ.20 లక్షలు Ððవెచ్చించినట్టు తెలుస్తోంది. ఈ సంగతి తెలుసుకున్న బీజేపీ నాయకులు గురువారం సాయంత్రం వాటిని కొన్నిచోట్ల తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment