వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముట్టడి
వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముట్టడి
Published Tue, Apr 11 2017 11:17 PM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM
డీఎంఅండ్‌హెచ్‌వో ఘెరావ్
అంతర్గత బదిలీలు, సస్పెన్షన్‌కు గురైన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని
ఉద్యోగుల డిమాండ్
సంఘీభావం ప్రకటించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
కలెక్టర్ చొరవతో ఆందోళన విరమణ
కాకినాడ వైద్యం (కాకినాడ సిటీ) : వైద్య ఆరోగ్య శాఖలో అంతర్గత బదిలీలు, సస్పెన్షన్‌కు గురైన సిబ్బందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలనే ప్రధాన డిమాండ్లతో వైద్య ఆరోగ్య ఉద్యోగ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ డీఎంహెచ్‌వో కార్యాలయాన్ని ముట్టడించారు. ఏజెన్సీ, జిల్లా నలుమూలల నుంచి వందల సంఖ్యలో ఉద్యోగులు డీఎంహెచ్‌వో కార్యాలయం వద్దకు చేరుకుని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె.చంద్రయ్యను ఘెరావ్ చేశారు. కార్యాలయంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్న జిల్లా అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏజెన్సీలో అరకొర సౌకర్యాల నడుమ విధులు నిర్వర్తిస్తూంటే, అనారోగ్యం, రక్తహీనతతో సంభవించిన మరణాలకు సిబ్బందిని బాధ్యులు చేస్తూ సస్షెండ్ చేయడంపై జేఏసీ నాయకులు గొంతి ఆస్కారరావు, ఎస్.విజయకుమార్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఎన్‌ఎం, ఎంపీహెచ్, ఎంపీహెచ్‌ఈవో, పీహెచ్‌ఎన్, పారా మెడికల్ సిబ్బందిని బాధ్యులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.ఏజెన్సీ ప్రాంతంలో నెలకొన్న సమస్యలు, అంతర్గత సమస్యల పరిష్కారం కోసం అనేక విపతి పత్రాలు అందించినా స్పందించకపోవడంతో మార్చి 23న సమ్మె నోటీసు ఉన్నతాధికారులకు ఇచ్చామన్నారు. అప్పటి నుంచి చర్చలు జరపకపోవడంతో ప్రజాస్వామ్య రీతిలో హక్కుల సాధనకు ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందన్నారు. అత్యవసరసేవల విభాగానికి చెందిన వైద్య ఆరోగ్యశాఖలో నెలకొన్న సమస్యలను కలెక్టర్, ఐటీడీఏ పీవోల దృష్టికి తీసుకెళ్లడంలో డీఎంహెచ్‌వో, గిరిజన డీఎంహెచ్‌వోలు వైఫల్యం చెందారని ఆరోపించారు. కింది స్థాయి íసిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ రోగులు, గర్భిణుల తరలింపునకు పీహెచ్‌సీకొక అంబులెన్స్, వైద్యాధికారి పర్యటనకు వాహన సౌకర్యం కల్పించాలని కోరారు. రిస్క్ అలవెన్సు మంజూరు చేయాలన్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా మూడేళ్లు దాటిన ఉద్యోగులను ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు రిలీవర్‌తో ముడిపెట్టకుండా చూడాలని కోరారు. తమ సమస్యలపై అధికారులు స్పందించేవరకుఆందోళన విరమించేది లేదని స్పష్టం చేయడంతో డీఎంహెచ్‌వో ఆందోళనకారులతో చర్చించారు. చర్చలు విఫలం కావడంతో తిరిగి ఆందోళన కొనసాగించారు. కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నేతలు ఉమామహేశ్వరరావు, ఎంవీవీ సత్యనారాయణ, డీఎల్ గంగాధర్, బియన్ మూర్తి, సీహెచ్ శ్రీనివాసరాజు, డీబీవీ ప్రసాద్, భాస్కరరావులతో పాటూ సిబ్బంది పాల్గొన్నారు.
అత్యవసర సేవలు నిర్వీర్యం
అత్యవసర సేవలైన వైద్య ఆరోగ్యశాఖను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆరోపించారు. మంగళవారం ఆయన డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో కాళ్లవాపు, రక్తహీనత సమస్యతో గిరిజనులు చనిపోతుంటే అధికార యంత్రాంగం, ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. బాధిత కుటుంబాలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించే వరకు ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. అత్యవసర విభాగానికి చెందిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని వేధింపులకు గురిచేయడం అన్యాయమన్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో ఒక్కో రంగాన్ని ప్రైవేటీకరిస్తోందన్నారు. అధికారంలో కొస్తే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందర్నీ పర్మినెంట్ చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు, ఉద్యోగులను తొలగించేందుకు అధికారుల ద్వారా వేధింపులకు పాల్పడడ, అక్రమ సస్పెన్షన్ల పేరుతో మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ఎల్లప్పుడూ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని, సమస్యల పరిష్కారం కోసం తమ వంతు చేయూతనిస్తామని ఆయన సంఘీభావం ప్రకటించారు. పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షుడు ప్రూటీకుమార్, బీసీ నేతలు గుబ్బల వెంకటేశ్వరరావు, బి.ప్రసన్నకుమార్, అల్లి రాజబాబు, బి.గోవిందు, ముత్తు సతీష్, గోపిశెట్టి సత్యనారాయణ, ఎస్సీ నాయకులు జంగా గగారిన్ పాల్గొన్నారు.
కలెక్టర్ చొరవతో ఆందోళన విరమణ
డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగ సంఘాల నేతలతో కలెక్టర్ బంగ్లాలో చర్చలు జరిపారు. సస్షెండ్‌కు గురైన సిబ్బందిపై ఉన్న ఉత్తర్వులను రద్దు చేసి తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డీఎంహెచ్‌ఓను కలెక్టర్ ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంత పీహెచ్‌సీ పరిధిలో చేపట్టిన అంతర్గత బదిలీలపై పునసమీక్ష చేయాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ,ఉద్యోగ సంఘాలు ఒక కమిటీ వేసుకుని బదిలీ అవసరంపై చర్చించుకోవాలన్నారు. మిగతా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాలని డీఎంహెచ్‌వోను కలెక్టర్ ఆదేశించినట్టు జేఏసీ నేలలు ఆస్కారరావు, విజయ్‌కుమార్ తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన కలెక్టర్‌కు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Advertisement