చీలికలు.. పదవులు
చీలికలు.. పదవులు
Published Fri, Aug 12 2016 11:38 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
⇒ ఇవే టీఆర్‌ఎస్ అస్త్రాలు
⇒ టీబీజీకేఎస్ గెలుపే లక్ష్యం
⇒ సంఘంలో చేరికలకు ప్రోత్సాహం
⇒ ప్రతిపక్ష నాయకులకు పదవుల ఎర
మంచిర్యాల సిటీ(ఆదిలాబాద్) : జింకను వేటాడాలంటే సింహం ఎంతో ఓపిక పడుతుంది. అదే సింహాన్ని వేటాడాలంటే రెట్టింపు ఓపిక అవసరం. ఇదే సూత్రాన్ని సింగరేణిలో రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో అధికార పార్టీ వాడనుంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎన్నికల గోల సంఘంగా టీబీజీకేఎస్‌ను మళ్లీ గెలిపించుకోవడమే ధ్యేయం. ఆ లక్ష్యంతో చాలా ఓపికగా మిగతా కార్మిక సంఘాల నాయకుల వేట మొదలెట్టింది. ముఖ్యంగా ప్రథమ, ద్వితీయ శ్రేణి నాయకత్వంపై దృష్టి సారించింది. ప్రతిపక్ష సంఘాల్లో చీలికలు తీసుకువచ్చి, వచ్చిన వారికి కోరుకున్న పదవులు కట్టబెట్టి రానున్న గుర్తింపు ఎన్నికల్లో గట్టెక్కడానికి టీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. ఆర్టీసీ ఎన్నికలకు ముందు అచ్చం ఇలాంటి ఎత్తుగడలు వేసిన టీఆర్‌ఎస్ అనుబంధ టీఎంయూను గెలిపించుకుంది. అదే స్ఫూర్తితో సింగరేణిలో పాచికలు విసరడానికి అధికార పార్టీ సిద్ధమైంది.
అసంతృప్తిని పసిగట్టి..
చీలికలను ప్రధాన అస్త్రంగా ప్రయోగిస్తున్న టీఆర్‌ఎస్ ముందుగా ప్రతిపక్ష సంఘాల్లోని అసంతృప్తి నాయకులను గుర్తిస్తోంది. వారికి ఏం కావాలి.. వారి బలహీనతలు ఏమిటి.. చీలికలు తీసుకువస్తే వారి వెంట ఎంత మంది నాయకులు వస్తారు.. ఏ తరం వారు చేరడానికి ఇష్టపడతారు.. గతంలో వారి పనితీరు ఎలా ఉంది.. కార్మికుల కోసం పనిచేసిన వారైతే సరి.. పదవులకు ఆశపడి చేరడానికి ఆసక్తి చూపేవారు అవసరం లేదు.. గతంలో వారు పనిచేసిన సంఘంలో గ్రూపులకు ఆశ్రయం ఇచ్చి కార్మికుల సమస్యలను పక్కన పెట్టినవారిని దరిచేరనివ్వొద్దు.. కోవర్టులను ముందే పసిగట్టి దూరం పెడుతూ యూనియన్ గెలుపుకోసం కష్టపడి పనిచేసే వారి కోసం జల్లెడ పడుతోంది అధికార పార్టీ.
పదవుల పెంపుపై దృష్టి
ఇతర సంఘాల నుంచి వచ్చిన వారికి న్యాయం చేయాలంటే ప్రస్తుతం ఉన్న పదవులు సరిపోవు. వారి స్థాయికి తగిన పదువులు ఇస్తామంటేనే వచ్చే అవకాశాలు ఉంటాయి. స్థాయికి తగిన పదవి ఇవ్వకుంటే తలనొప్పి తయారవుతుంది. అందుకే టీఆర్‌ఎస్ పార్టీతో పాటు అనుబంధ సంఘంలో పదవులు సర్దా ల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కార్మిక సంఘాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా కోరుకునేది యూనియన్ పదవులే. పార్టీలో ఇస్తామంటే ఆసక్తి చూపే అవకాశం లేదు. అందుకే ఏరియా నుంచి రీజియన్‌తో పాటు నాలుగు జిల్లాల స్థాయి పదవులు ఉండాలనే ఆలోచన చేస్తోంది. ప్రథమ శ్రేణి నాయకులకు అదే స్థాయిలో పదవులు ఉండాలి కాబట్టి ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా జోడించాలి. గౌరవ అధ్యక్షుడు, సీనియర్ ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శులు, ముఖ్య సలహాదారులు వంటి పదవుల సంఖ్య పెంచే అవకాశం ఉంది. ప్రస్తుత కమిటీలో ఇటువంటి పదవులు లేవు. ప్రత్యేక పరిస్థితుల్లో పెంచక తప్పదని తెలుస్తోంది.
బలోపేతమయ్యూకే ఎన్నికలకు..
ప్రతిపక్ష సంఘాల నుంచి చేరికలు పూర్తయి వారికి పదవులు కేటారుుంచిన తర్వాతే గుర్తింపు సంఘం ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో టీబీజీకేఎస్‌కు సరైన నాయకత్వం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సంఘాన్ని బలోపేతం చేయడంపై అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే ఎన్నికల బరిలోకి దిగనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Advertisement