
భర్త అనిల్‌తో సన (ఫైల్)
సాక్షి, హన్మకొండ/ఖమ్మం: మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి కేసులో నాలుగో నిందితురాలిగా ఉన్న సిరిసిల్ల అనిల్ రెండో భార్య సనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సారిక మృతి కేసులో కీలక విషయాలను ఆమె నుంచి రాబట్టేందుకు పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. ఖమ్మం నగరంలో శనివారం రాత్రి సనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అధికారికంగా సోమవారం సన అరెస్టును పోలీసులు ప్రకటించే అవకాశం ఉంది.
వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో సంఘటన జరిగిన రోజు నుంచి సిరిసిల్ల అనిల్ రెండో భార్య సన పరారీలో ఉంది. సన ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఆమె ఉందనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అమె అక్కడి నుంచి పరారయ్యారని భావించి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.
చివరికి ఈ నెల 7న ఖమ్మం నగరంలోని ఖిల్లాబజార్ ప్రాంతంలో సనను, ఆమె సోదరుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే, సనను అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) క్యాంపులో ఓ క్వార్టరు లో సన నుంచి వివరాలు రాబడుతున్నట్లు తెలిసింది.
కాగా, సనను అరెస్టు చేసిన విషయాన్ని ఖమ్మం జిల్లాలోని పోలీసులు ధ్రువీకరించడం లేదు. ఖమ్మం రూరల్ మండలంలో తన బంధువుల ఇంట సనా ఆశ్రయం పొందుతున్నట్టు తెలుసుకున్న హన్మకొండ సుబేదారి పోలీసులు ఆమెను, ఆమెతో పాటు ఉన్న సోదరుణ్ని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.