గుంటూరు : తుని ఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. వారందరూ రౌడీషీటర్లు అని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరులో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తుని ఘటనపై విచారణ వేగంగా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
అంతకుముందు తీవ్ర అనారోగ్యంతో గుంటూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ మహిళ కమిషన్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారిని ఆయన పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను రాజప్ప ఆరా తీశారు.
ఇదిలా ఉంటే... తుని ఘటనలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ 6 మందిని సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి... రహాస్య ప్రాంతానికి తరలించి... విచారిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ... సదరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో అమలాపురంలో భారీగా బలగాలను మోహరించారు.