వీడు ఆరడుగుల బుల్లెట్
నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (అమెరికా) కోచ్ జాజ్ రిచర్డ్స్ సోమవారం విజయవాడలోని ఆం«ధ్ర లయోల కళాశాలలో సందడి చేశారు. బాస్కెట్‌బాల్ టెక్నికల్ క్యాంపు కింద లయోల కళాశాల క్రీడాకారులకు బాస్కెట్‌బాల్‌లో మెలకువల నేర్పించారు. బాస్కెట్‌బాల్ పోస్టును ఇట్టే అందుకుంటున్న ఆరు అడుగుల ఏడు అంగుళాలు ఉన్న జాజ్ రిచర్డ్స్ వయస్సు 34. ప్రకాశం జిల్లా కొమరినేనివారిపాలేనికి చెందిన ఎన్.యర్ర సూర్యనారాయణ, వెంకాయమ్మ మనుమరాలైన హషీకి భర్త. వీరితో పాటు హషీ తల్లి సుబ్బాయమ్మ కూడా లయోల కళాశాలకు విచ్చేశారు. 30 దేశాల తరఫున ఆడిన బాస్కెట్‌బాల్ ఆటగాడిగా, ఇండిపెండెంట్ బాస్కెట్‌బాల్ కోచ్‌గా, 10 దేశాలకు కోచ్‌గా జాజ్ రిచర్డ్స్ వ్యవహరించారు. జాజ్ రిచర్డ్స్, హషీకి కుమారుడు జూనియర్ జాజ్ రిచర్డ్స్ (4) ఉన్నాడు. జూనియర్ జాజ్ రిచర్డ్స్ కూడా తండ్రికి తగ్గ తనయుడిగా నాలుగేళ్లకే బంతిని బాస్కెట్‌లోకి వేయడం విశేషం. లైఫ్‌స్టైల్ మీడియా, హషీ తమ్ముడు దివంగత వినోద్ నాగుబడి పేరుతో ఉన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో బాస్కెట్‌బాల్ టెక్నికల్ క్యాంపు నిర్వహించేందుకు జాజ్ రిచర్డ్స్‌ను ఆహ్వానించారు. చికాగోలోని లయోల కళాశాలలో చదివిన జాజ్ రిచర్డ్స్ ఆంధ్ర లయోల కళాశాల పేరు విని ఇక్కడకు విచ్చేసినట్లు కళాశాల పీడీ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. కళాశాల పిన్సిపాల్ ఫాదర్ జీఏపీ కిషోర్, వైస్ ఫాదర్ మాలిక్యూర్ పాల్గొన్నారు.
- విజయవాడ స్పోర్ట్స్