హైదరాబాద్:కోర్టు ధిక్కార కేసులో గుంటూరు జిల్లా వినుకొండ తహసీల్దార్ కె.శివన్నారాయణమూర్తికి హైకోర్టు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి శుక్రవారం తీర్పునిచ్చారు. గుంటూరు జిల్లాలోని వినుకొండకు చెందిన ఆర్.కోటేశ్వరరావు, బి.శివలక్ష్మి వేర్వేరుగా చౌక ధర దుకాణాలు నిర్వహిస్తున్నారు. వీరి దుకాణాల్లో సరుకు కొలతల్లో చిన్నపాటి తేడాలు ఉన్నాయంటూ వారి దుకాణాల ఆథరైజేషన్‌ను అధికారులు రద్దు చేశారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా, అసలు తనిఖీ చేయకుండానే ఆథరైజేషన్‌ను రద్దు చేశారంటూ వారిద్దరూ గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిని న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి విచారించారు. భారీ స్థాయిలో అక్రమాలు ఉంటే తప్ప, చిన్న లోపాల కారణంగా ఆథరైజేషన్‌ను రద్దు చేయడానికి వీల్లేదని ఇదే హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుంటూ కోటేశ్వరరావు, శివలక్ష్మికి అనుకూలంగా న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
ఆథరైజేషన్ రద్దు విషయంలో కోటేశ్వరరావు, శివలక్ష్మి వివరణలు సమర్పించినందున, వాటిని పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం వెలువరించాలని, అప్పటి వరకు ఆమె చౌక ధర దుకాణాన్ని యథావిధిగా కొనసాగించాలని అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. అయితే ఈ ఉత్తర్వులను ఆర్‌డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ శివన్నారాయణమూర్తి ఉల్లంఘించారని, వీరిపై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోవాలంటూ కోటేశ్వరరావు, శివలక్ష్మి వేర్వేరుగా జస్టిస్ రాజశేఖరరెడ్డి ముందు కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన న్యాయమూర్తి కోర్టు ఉత్తర్వులను తహసీల్దార్ శివన్నారాయణమూర్తి ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారంటూ ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించారు.