ఇసుక అక్రమార్కులకు భారీ జరిమానాలు
సాక్షి, హైదరాబాద్: పట్టా భూముల నుంచి ఇసుక తరలించేందుకు ఇక ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అలాగే ఇసుకను అక్రమంగా రవాణా చేసేవారు భారీగా జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు సవరించిన ఇసుక పాలసీకి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం మంగళవారం జారీ చేసింది. నిర్ధారిత ఇసుక పరిమాణంతో నిమిత్తం లేకుండా గరిష్టంగా ఏడాదిపాటు మాత్రమే గడువు ఉండేలా ఇసుక రీచ్‌లను లాటరీల ద్వారా కేటాయించాలని నిర్ణయించారు. కొత్త విధానానికి సంబంధించి ముఖ్య వివరాలివీ..
వరదల వల్ల మేట వేసిన ఇసుకను తొలగించి పట్టా భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చుకునేందుకు గతంలో వ్యవసాయ అధికారికి సంబంధిత భూమి యజమానులు దరఖాస్తు చేసుకుంటే జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డెరైక్టరు పర్మిట్లు జారీ చేసేవారు. ఇక నుంచి ప్రభుత్వమే పర్మిట్లు జారీ చేస్తుంది. పట్టా భూముల్లో ఇసుక తొలగింపునకు గతంలోలాగే భూ యజమానులు వ్యవసాయ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ అధికారి, h. సంయుక్త సర్వే నిర్వహించి జిల్లా కలెక్టరుకు నివేదిక ఇస్తారు. పట్టా భూమిలో ఎంత పరిమాణంలో ఇసుక మేట వేసిందనే అంశంపై జిల్లా కలెక్టరు ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. దీని ఆధారంగా ప్రభుత్వమే పర్మిట్లు జారీ చేస్తుంది.
ఏయే రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలనే అంశాన్ని జాయింట్ కలెక్టరు నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ (డీఎల్‌సీ) నిర్ణయిస్తుంది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం అక్రమంగా ఇసుక తరలించే వాహనాలను సీజ్ చేసేందుకు మాత్రమే అధికారులకు అనుమతి ఉంది. కొత్త పాలసీ ప్రకారం జరిమానాలు విధించనున్నారు. అక్రమంగా ఇసుక తరలించే ట్రాక్టరు తొలిసారి పట్టుపడితే రూ.5 వేలు, రెండోసారి దొరికితే రూ.15 వేల జరిమానా వసూలు చేస్తారు. అలాగే 10 టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఏదైనా లారీ పట్టుబడితే తొలిసారి రూ.15 వేలు, రెండోసారి దొరికితే రూ.25 వేల జరిమానా విధిస్తారు. 10 టన్నుల కన్నా ఎక్కువ ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ దొరికిపోయిన లారీకి మొదటిసారి అయితే రూ.25 వేలు, రెండోసారి అయితే ఏకంగా రూ.50 వేల జరిమానా విధిస్తారు.
ఇక నుంచి చెరువులు, చిన్నతరహా నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఇసుక తవ్వకాలకు కలెక్టర్లు అనుమతి ఇస్తారు. పెద్ద ప్రాజెక్టుల్లో తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది.
గతంలో ఇసుక రీచ్‌లను వేలం పాటలో పొంది ఈఎండీ కింద చెల్లించిన రూ.84 కోట్లను ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది. ఈఎండీ బకాయిలు ఉన్న కాంట్రాక్టర్లు కోరితే ఏడాదిపాటు ప్రభుత్వం.. రీచ్‌లను వారికే రెన్యూవల్ చేయనుంది. కాంట్రాక్టర్లు రెన్యూవల్ కోరని పక్షంలో వారికి చెల్లించాల్సిన బకాయిలను చెల్లిస్తుంది.