తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
సాక్షి, హైదరాబాద్ : రైతు సమన్వయ సమితి సభ్యులతో ఆదివారం హైదరాబాద్‌లో సదస్సు జరగనుంది. ఇందు కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం కరీంనగర్‌లోనూ సదస్సు నిర్వహించనున్నారు. వేలాది మంది పాల్గొనే ఈ సదస్సులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ రైతు సమన్వయ సమితి కరదీపికను రూపొందించింది.
వీటిని రైతు సమితి సభ్యులకు అందజేయనున్నారు. ‘దుక్కి దున్ని విత్తనం వేసిన దగ్గర నుంచి పంటకు గిట్టుబాటు ధర సాధించే వరకు అన్ని దశల్లో రైతులే అన్నింటినీ నిర్ణయించి శాసించాలి. రైతులు సంఘటిత వ్యవస్థగా మారినప్పుడే ఇది సాధ్యం’అన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో కరదీపికను ప్రారంభించారు. సీఎం పర్యవేక్షణలోనే కరదీపిక రూపుదిద్దుకున్నట్టు సమాచారం.
‘‘రైతుల సమస్యలకు పరిష్కారం రైతుల చేతుల్లోనే ఉంది. ఎవరో వచ్చి సమస్యలు పరిష్కరిస్తారనే అచేతనావస్థలో ఉండకూడదు. వ్యవసాయం దండగ కాదు పండగ అని రైతు భావించే స్థాయికి వ్యవసాయ రంగాన్ని తీసుకువెళ్లాలన్న లక్ష్యసాధనకు రైతు సమన్వయ సమితులే సారథ్యం వహిస్తాయి.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రైతు సమన్వయ సమితి పుణికిపుచ్చుకోవాలి’’అని కరదీపికలో పేర్కొన్నారు. రైతు కార్పొరేషన్, గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో సమితులు, వాటి విధులు, రైతులకు పెట్టుబడి సొమ్ము అందజేయడంలో పోషించాల్సిన పాత్ర తదితర అంశాలను ఇందులో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment