ఆరు విత్తన షాపుల లైసెన్స్‌లు సస్పెన్షన్
Published Thu, Oct 6 2016 6:00 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
జేడీఏ కృపాదాసు
గుంటూరు (కొరిటెపాడు) : నకిలీ విత్తనాలు విక్రయించి రైతులు నష్టపోవటానికి కారణమైన ఆరు విత్తన షాపుల లైసెన్సులను సస్పెండ్ చేసి అమ్మకాలు నిలిపి వేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వీడీవీ కృపాదాసు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మేడికొండూరు, అమరావతి మండలాల్లో జీవా అగ్రి జెనిటిక్స్ కంపెనీకి సంబంధించిన మిరప జేసీహెచ్–802 హైబ్రిడ్ రకాన్ని సాగు చేసి తీవ్రంగా నష్టపోయినట్లు రైతులు, రైతు సంఘాల నుంచి ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు. ఆ ఫిర్యాదులకు స్పందించి ఉద్యాన శాఖ శాస్త్రవేత్తలు, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో కూడిన జిల్లా కమిటీ ఆయా పొలాలను సందర్శించారని తెలిపారు. ఈ రకం మిరప విత్తనాలు సాగు చేసిన రైతుల పొలాల్లో 30 నుంచి 35 శాతం జన్యు స్వచ్ఛత లేనట్లుగా తేలిందని పేర్కొన్నారు. దీంతో మేడికొండూరు పోలీస్ స్టేషన్‌లో జీవా కంపెనీపై నమోదు చే సిన 420 కేసుకు సపోర్టుగా జిల్లా కమిటీ రిపోర్టు ఇచ్చిందని వివరించారు. రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా చేసిన ఆరు షాపుల లైసెన్సులను విత్తన చట్టం ప్రకారం సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా అగ్రి జెనిటిక్స్ కంపెనీ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ వ్యవసాయ శాఖ డైరెక్టర్‌కు జిల్లా కమిటీ రిపోర్టు అందజేసినట్లు ఆయన వివరించారు.
Advertisement