గ'జీత'గాళ్ల దీనస్థితి
గ'జీత'గాళ్ల దీనస్థితి
Published Tue, Aug 16 2016 4:42 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
* పుష్కరాల్లో వేతనం కంటే.. పని ఎక్కువ
* పనిగంటలు పాటించని అధికారులు
* కనీసం భోజనం కూడా అందని వైనం
రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు వారిని.. కృష్ణా పుష్కరాల్లో భక్తుల రక్షణ కోసం పని చేస్తే.. అన్ని వసతులు కల్పిస్తామని అధికారులు చెప్పారు.. కానీ ఇక్కడకు వస్తే.. కనీసం భోజనం కూడా పెట్టని పరిస్థితి.. ఎనిమిది గంటల పాటే విధులన్నారు.. పన్నెండు గంటల పాటు పని చేయిస్తున్నారు. అన్ని గంటలు నీటిలో నిలబడ్డా.. కనీసం వారిని పట్టించుకునే నాథుడే లేడు.. అమరావతిలోని పుష్కర ఘాట్లులో గజఈతగాళ్ళు పడుతున్న బాధలు వర్ణనాతీతం.
పట్నంబజారు (గుంటూరు): కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఏదైనా ఘటనలు జరిగినా.. భక్తులు పొరపాటున నీటిలో మునిగినా.. కీలక పాత్ర పోషించేది ఈతగాళ్ళే. బ్లూ టీషర్ట్ వేసుకుని పడవలపై వృద్ధులకు సాయం అందిస్తూ భక్తులకు రక్షణగా ఉంటున్నారు. ఆఖరికి మట్టిని కూడా తొలగించే బాధ్యతలను వారు నిర్వర్తిస్తున్నారు. పుష్కరాల్లో భాగంగా నిత్యం రూ. 450 చెల్లించి 250 మంది ఈతగాళ్ళను మత్య్సశాఖ వారు విధుల్లోకి తీసుకున్నారు. 11వ తేదీ రాత్రి నుంచే వీరు విధుల్లో ఉన్నారు. కానీ వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. నిత్యం రాత్రి సమయాల్లో కూడా పడవల్లోనే నిద్రించాల్సి దుస్థితి. తినేందుకు భోజనం కూడా దొరకని పరిస్థితి. అధికారులు భోజనం పంపటంలేదని ఈతగాళ్లు చెబుతున్నారు. దీని వలన అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నో సేవలు...
కేవలం ఇబ్బందులు కలిగిన సమయంలోనే కాకుండా భక్తులకు ఈతగాళ్లు ఎన్నో సేవలందిస్తున్నారు. అనేక మంది వృద్ధులు పిండ ప్రదానం చేసేందుకు వచ్చి నీటిలోకి దిగాలంటనే ఒకటికి పలుమార్లు ఆలోచించే పరిస్థితులు ఉన్నాయి. ఆ సమయాల్లో వారు ఆ వృద్ధులను తీసుకుని వెళ్లి నదిలోకి చివర పిండ ప్రదానాలు చేయించి తిరిగి ఘాట్‌లపై వదలి పెడుతున్నారు. ఏక కాలంలో ఎనిమిది గంటల పాటు నీటిలో ఉండాలంటే సామాన్యమైన విషయం కాదని భక్తులు అంటున్నారు. భక్తులకు ఇటువంటి సేవలందిస్తున్న వారికి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement
Advertisement