skilled swimmers
-
మంచితనానికి మారుపేర్లు వీళ్లు...
తాడేపల్లి రూరల్: భక్తులు పోగొట్టుకున్న బంగారు వస్తువులను వెతికి అప్పగిస్తూ గజ ఈతగాళ్ళు శభాష్ అనిపించుకుంటున్నారు. సీతానగరం ఘాట్‌లో ఉంగరం పోయినా నిమిషాల వ్యవధిలోనే వెతికి చేతికి అందిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఓ మహిళ పోగొట్టుకున్న మంగళసూత్రాలు అప్పగించిన గజ ఈతగాళ్ళు సోమవారం ఒక బాలిక పోగొట్టుకున్న ఉంగరాన్ని నీళ్లల్లో నుంచి వెతికి తీసి ఇచ్చారు. -
పట్టించుకుంటేనే విధుల్లోకి..
* అధికారులకు అల్టిమేటం జారీ చేసిన ఈతగాళ్లు * సీఎం వస్తున్న క్రమంలో ఆందోళనకు సిద్ధమైన వైనం * అధికారులు సర్దిచెప్పడంతో మళ్లీ విధుల్లోకి... అమరావతి (పట్నంబజారు): ఉదయం ఐదు గంటలకు వస్తున్నాం..కనీసం ముద్ద అన్నం పెట్టడం లేదు..ఇదేంటి సారూ..అని అడిగితే..వేటకు వెళ్లేప్పుడు భోజనం తీసుకువెళ్తారుగా..అలాగే రండి అంటూ..అధికారులు సమాధానమిస్తున్నారని అమరావతి ధ్యానబుద్ధ పుష్కర ఘాట్‌లోని గజ ఈతగాళ్లు వాపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వస్తున్న క్రమంలో తమ బాధలు ఆయన దృష్టికి తెచ్చేందుకు ఆందోళనకు సిద్ధమయ్యారు.అధికారులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, కేవలం భక్తుల రక్షణ కోసం మాత్రమే తాము విధుల్లోకి వచ్చామన్నారు. భక్తుల కోసం తాము ఎటువంటి పని చెప్పినా..కాదనకుండా చేస్తున్నామని, అయినా అధికారులు తమపై చిన్నచూపుతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాగే చేస్తే.. ఎట్టి పరిస్థితుల్లో పనులు చేయమని తేల్చి చెప్పారు. అమరేశ్వర ఘాట్‌లో ఈతగాళ్లకు రూ.800 వరకు ఇస్తున్నార ని, ఇక్కడ మాత్రం కేవలం రూ.450 ఇస్తున్నారని ఆరోపించారు. ఈతగాళ్లు ఆందోళనకు సిద్ధమయ్యారని తెలుసుకున్న మత్య్సశాఖాధికారులు ఘాట్‌కు చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అధికారులు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఈతగాళ్లు యథావిధిగా తమ విధుల్లోకి వెళ్లారు. -
గ'జీత'గాళ్ల దీనస్థితి
* పుష్కరాల్లో వేతనం కంటే.. పని ఎక్కువ * పనిగంటలు పాటించని అధికారులు * కనీసం భోజనం కూడా అందని వైనం రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు వారిని.. కృష్ణా పుష్కరాల్లో భక్తుల రక్షణ కోసం పని చేస్తే.. అన్ని వసతులు కల్పిస్తామని అధికారులు చెప్పారు.. కానీ ఇక్కడకు వస్తే.. కనీసం భోజనం కూడా పెట్టని పరిస్థితి.. ఎనిమిది గంటల పాటే విధులన్నారు.. పన్నెండు గంటల పాటు పని చేయిస్తున్నారు. అన్ని గంటలు నీటిలో నిలబడ్డా.. కనీసం వారిని పట్టించుకునే నాథుడే లేడు.. అమరావతిలోని పుష్కర ఘాట్లులో గజఈతగాళ్ళు పడుతున్న బాధలు వర్ణనాతీతం. పట్నంబజారు (గుంటూరు): కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఏదైనా ఘటనలు జరిగినా.. భక్తులు పొరపాటున నీటిలో మునిగినా.. కీలక పాత్ర పోషించేది ఈతగాళ్ళే. బ్లూ టీషర్ట్ వేసుకుని పడవలపై వృద్ధులకు సాయం అందిస్తూ భక్తులకు రక్షణగా ఉంటున్నారు. ఆఖరికి మట్టిని కూడా తొలగించే బాధ్యతలను వారు నిర్వర్తిస్తున్నారు. పుష్కరాల్లో భాగంగా నిత్యం రూ. 450 చెల్లించి 250 మంది ఈతగాళ్ళను మత్య్సశాఖ వారు విధుల్లోకి తీసుకున్నారు. 11వ తేదీ రాత్రి నుంచే వీరు విధుల్లో ఉన్నారు. కానీ వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. నిత్యం రాత్రి సమయాల్లో కూడా పడవల్లోనే నిద్రించాల్సి దుస్థితి. తినేందుకు భోజనం కూడా దొరకని పరిస్థితి. అధికారులు భోజనం పంపటంలేదని ఈతగాళ్లు చెబుతున్నారు. దీని వలన అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సేవలు... కేవలం ఇబ్బందులు కలిగిన సమయంలోనే కాకుండా భక్తులకు ఈతగాళ్లు ఎన్నో సేవలందిస్తున్నారు. అనేక మంది వృద్ధులు పిండ ప్రదానం చేసేందుకు వచ్చి నీటిలోకి దిగాలంటనే ఒకటికి పలుమార్లు ఆలోచించే పరిస్థితులు ఉన్నాయి. ఆ సమయాల్లో వారు ఆ వృద్ధులను తీసుకుని వెళ్లి నదిలోకి చివర పిండ ప్రదానాలు చేయించి తిరిగి ఘాట్లపై వదలి పెడుతున్నారు. ఏక కాలంలో ఎనిమిది గంటల పాటు నీటిలో ఉండాలంటే సామాన్యమైన విషయం కాదని భక్తులు అంటున్నారు. భక్తులకు ఇటువంటి సేవలందిస్తున్న వారికి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.