పట్టించుకుంటేనే విధుల్లోకి..
* అధికారులకు అల్టిమేటం జారీ చేసిన ఈతగాళ్లు
* సీఎం వస్తున్న క్రమంలో ఆందోళనకు సిద్ధమైన వైనం
* అధికారులు సర్దిచెప్పడంతో మళ్లీ విధుల్లోకి...
అమరావతి (పట్నంబజారు): ఉదయం ఐదు గంటలకు వస్తున్నాం..కనీసం ముద్ద అన్నం పెట్టడం లేదు..ఇదేంటి సారూ..అని అడిగితే..వేటకు వెళ్లేప్పుడు భోజనం తీసుకువెళ్తారుగా..అలాగే రండి అంటూ..అధికారులు సమాధానమిస్తున్నారని అమరావతి ధ్యానబుద్ధ పుష్కర ఘాట్‌లోని గజ ఈతగాళ్లు వాపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వస్తున్న క్రమంలో తమ బాధలు ఆయన దృష్టికి తెచ్చేందుకు ఆందోళనకు సిద్ధమయ్యారు.అధికారులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, కేవలం భక్తుల రక్షణ కోసం మాత్రమే తాము విధుల్లోకి వచ్చామన్నారు. భక్తుల కోసం తాము ఎటువంటి పని చెప్పినా..కాదనకుండా చేస్తున్నామని, అయినా అధికారులు తమపై చిన్నచూపుతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాగే చేస్తే.. ఎట్టి పరిస్థితుల్లో పనులు చేయమని తేల్చి చెప్పారు. అమరేశ్వర ఘాట్‌లో ఈతగాళ్లకు రూ.800 వరకు ఇస్తున్నార ని, ఇక్కడ మాత్రం కేవలం రూ.450 ఇస్తున్నారని ఆరోపించారు. ఈతగాళ్లు ఆందోళనకు సిద్ధమయ్యారని తెలుసుకున్న మత్య్సశాఖాధికారులు ఘాట్‌కు చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అధికారులు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఈతగాళ్లు యథావిధిగా తమ విధుల్లోకి వెళ్లారు.