duteis
-
మూడు షిప్టులు... రెండు బ్యాచ్‌లు
విధి నిర్వహణలో పోలీసులు సతమతం అమరావతి (తాడికొండ) : అమరావతి మండలం వైకుంఠపురంలోని పుష్కరఘాట్‌లో విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పరిస్థితి దయనీయంగా మారింది. అర్బన్ పరిధిలో రోజుకు మూడు షిప్టులకు మూడు బ్యాచ్‌లుగా విభజించి ఘాట్లలో విధులు నిర్వహిస్తున్నారు. రూరల్ పరిధిలోని అన్ని ఘాట్లలో మాత్రం మూడు షిప్టులుగా విభజించారు కానీ రెండు బ్యాచ్‌లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నాయి. దీంతో ప్రతిరోజూ ఒక కానిస్టేబుల్ 12 గంటలు విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. పొరపాటున ఏదైనా సంఘటన జరిగితే ఇబ్బంది పడతామన్న ఆందోళనతో విధులు నిర్వహిస్తున్నారు. 12 గంటల విధి నిర్వహణతో అసౌకర్యానికి గురవుతున్నామని కొందరు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 7వ తేదీ నుంచి పుష్కర విధులకు హాజరయ్యామని, నేటివరకు ఇంటిముఖం చూడలేదని పలువురు సిబ్బంది వాపోతున్నారు. కేవలం రూరల్ పరిధిలోని పోలీసులకే ఈ పరిస్థితి నెలకొందన్నారు. మరో వారం పాటు పుష్కర విధులు నిర్వహించాల్సి ఉందని, 12 గంటల డ్యూటీ చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. ఇప్పటినుంచైనా 3 షిప్టులకు మూడు బ్యాచ్‌లను విభజించి 8 గంటల డ్యూటీ అమలు చేయాలని కోరుతున్నారు. -
పట్టించుకుంటేనే విధుల్లోకి..
* అధికారులకు అల్టిమేటం జారీ చేసిన ఈతగాళ్లు * సీఎం వస్తున్న క్రమంలో ఆందోళనకు సిద్ధమైన వైనం * అధికారులు సర్దిచెప్పడంతో మళ్లీ విధుల్లోకి... అమరావతి (పట్నంబజారు): ఉదయం ఐదు గంటలకు వస్తున్నాం..కనీసం ముద్ద అన్నం పెట్టడం లేదు..ఇదేంటి సారూ..అని అడిగితే..వేటకు వెళ్లేప్పుడు భోజనం తీసుకువెళ్తారుగా..అలాగే రండి అంటూ..అధికారులు సమాధానమిస్తున్నారని అమరావతి ధ్యానబుద్ధ పుష్కర ఘాట్‌లోని గజ ఈతగాళ్లు వాపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వస్తున్న క్రమంలో తమ బాధలు ఆయన దృష్టికి తెచ్చేందుకు ఆందోళనకు సిద్ధమయ్యారు.అధికారులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, కేవలం భక్తుల రక్షణ కోసం మాత్రమే తాము విధుల్లోకి వచ్చామన్నారు. భక్తుల కోసం తాము ఎటువంటి పని చెప్పినా..కాదనకుండా చేస్తున్నామని, అయినా అధికారులు తమపై చిన్నచూపుతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాగే చేస్తే.. ఎట్టి పరిస్థితుల్లో పనులు చేయమని తేల్చి చెప్పారు. అమరేశ్వర ఘాట్‌లో ఈతగాళ్లకు రూ.800 వరకు ఇస్తున్నార ని, ఇక్కడ మాత్రం కేవలం రూ.450 ఇస్తున్నారని ఆరోపించారు. ఈతగాళ్లు ఆందోళనకు సిద్ధమయ్యారని తెలుసుకున్న మత్య్సశాఖాధికారులు ఘాట్‌కు చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అధికారులు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఈతగాళ్లు యథావిధిగా తమ విధుల్లోకి వెళ్లారు. -
విధుల్లో అలసత్వం వద్దు
జిల్లా పంచాయతీ అధికారి శ్రీదేవి గుంటూరు వెస్ట్: పుష్కర విధుల్లో అలసత్వం పనికి రాదని, తమకు అప్పగించిన పనులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి కె.శ్రీదేవి సిబ్బందికి సూచించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లాలోని పంచాయతీ సెక్రటరీలు, ఈఓపీఆర్డీలు, వైద్యసిబ్బందికి సంయుక్తంగా మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల సందర్భంగా తమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పారిశుధ్య పనులను సక్రమంగా నిర్వహించి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు. ఇతర శాఖల అధికారులతో ముఖ్యంగా వైద్య ఆరోగ్య సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సూచించారు. పుష్కర ఘాట్లు, నగర్లలో ఏర్పాటు చేసిన ప్రదేశాలలో ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కోరారు. ఫాగింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు వహించాలని అన్నారు. యాత్రికులతో మర్యాదగా వ్యవహరించి వారికి అవసరమైన సేవలను అందించాలన్నారు. వైద్యాధికారి సుధీర్ క్లోరినేషన్ చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మలేరియా విభాగం అధికారి రవీంద్రబాబు, డీఎల్పీఓ సత్యనారాయణ, జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 200 మంది పంచాయతీ సెక్రటరీలు, ఈఓపీఆర్డీలు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.