నత్తే నయం | slow of handrineeva works | Sakshi
Sakshi News home page

నత్తే నయం

Published Tue, Jul 18 2017 9:51 PM | Last Updated on Wed, Sep 26 2018 6:21 PM

నత్తే నయం - Sakshi

నత్తే నయం

- ముందుకు సాగని హంద్రీ-నీవా వెడల్పు పనులు
- ఫలితమివ్వని 90 రోజుల కార్యచరణ
- ఆందోళనలో రైతన్నలు
– ఆయకట్టుకు నీరివ్వాలని వేడుకోలు


అనంత రైతులకు హంద్రీ-నీవా జలాలు అందనంటున్నాయి. కార్యాచరణ ప్రణాళికలన్నీ కాగితాలకే పరిమితం కాగా...రైతుల ఆశలన్నీ నీరుగారుతున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించిన 90 రోజుల ప్రణాళిక కూడా ప్రశ్నార్థకంగా మారింది. సంవత్సరాల తరబడి సాగుతున్న పనులతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

ఉరవకొండ : ‘‘అనంత రైతాంగానికి హంద్రీ-నీవా జలాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం..90 రోజుల్లో డిస్ర్టిబ్యూటరీలను పూర్తి చేసి ఆయకట్టుకు నీరందిస్తాం..పనుల్లో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్‌లను బ్లాక్‌ లిస్టులో పెడతాం’’ మార్చి మొదటి వారంలో అధికారుల సమీక్షలో సీఎం చంద్రబాబు అన్న మాటలివి. దీంతో అనంత రైతులంతా ఈ ఖరీఫ్‌కు హంద్రీ-నీవా జలాలు అందుతాయని ఆశగా ఎదురుచూశారు. కానీ పనులు ప్రారంభానికి కూడా నోచుకోలేదు. ఇటీవల జిల్లాలో పర్యటించిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా 90 రోజుల ప్రణాళిక ప్రకటించారు. అనంత రైతాంగానికి హంద్రీ-నీవా నీళ్లిచ్చి తీరుతామని గొప్పలు చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా పనులు సా....గుతున్నాయి.

జూన్‌ 10న ప్రారంభం
హంద్రీ-నీవా కాలువ వెడల్పు పనులు జూన్‌ 10న యుద్ధప్రతిపాదికన ప్రారంభయ్యాయి. వారం రోజుల పాటు ఐదు చోట్ల భారీ యంత్రాలతో చురుగ్గా సాగినా.... ఆ తర్వాత ముందుకు సాగడం లేదు. 216 కిలోమీటర్లు కాలువ వెడల్పు పనులు మూడు ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టుర్లకు అప్పగించినా పనుల్లో పురోగతి కనిపించడం లేదు.

90 రోజుల్లో పూర్తి చేయడం సాధ్యమేనా?
హంద్రీనీవా కాలువ తవ్వడానికి ఏడేళ్లు పట్టింది. అంతేస్థాయిలో ఉన్న కాలువ వెడల్పు పనులు మూడంటే మూడు నెలల్లో పూర్తి చేయడం సాధ్యమైయ్యే పనేనా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో కాలువను 10 మీటర్లు మేర(బెడ్‌ లెవెల్‌) తవ్వడానికే ఏడేళ్లు పట్టింది. ప్రస్తుతం కాలువ బెడ్‌ను 19.5 మీటర్లకు పెంచాల్సి ఉంది. అంటే గతంలో జరిగినంత  మేర మళ్లీ  ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి.  ఈ నేపథ్యంలో ఏడేళ్లు సాగిన పనులను 90 రోజుల్లో పూర్తి చేయడం సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారు. పైగా నిధుల సమస్య, భూసేకరణ లాంటివి కుడా కాలువ వెడల్పు పనులకు ఆటంకం కల్పించనున్నాయి.

పనుల కేటాయింపు ఇలా...
216 కి.మీ. నిడివి కలిగిన హంద్రీనీవా కాలువను వెడల్పు పనులు చేయడానికి మూడు ప్యాకేజీలుగా విభజించారు. కర్నూలు జిల్లా మాల్యాల నుంచి 64వ ప్యాకేజీని రిత్విక్‌ ప్రాజెక్టు ఇండియా లిమిటెడ్‌ సంస్థకు, 64వ కి.మీ. నుంచి 134 కి.మీ. వరకూ రెండవ ప్యాకేజీని హిందూస్థాన్‌ ఇంజనీర్స్‌ సిండికేట్‌ సంస్థకు. 134 కి.మీ. నుంచి జీడిపల్లి రిజర్వాయర్‌ వరుకు  మూడవ ప్యాకేజీ పనులను ఎంఈఐఎల్‌ సంస్థకు అప్పగించారు. మన జిల్లా పరిధిలో 82 కి.మీ. కాలువ పనులను ఎంఈఐఎల్‌ సంస్థ చేపట్టింది. మట్టి తొలగించి కాలువ వెడల్పు చేసే పనులను ఆ సంస్థ  ఐదు కంపెనీలు సబ్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చింది. కాలువలో ఉన్న సిమెంట్‌ నిర్మాణాల వద్ద లైనింగ్, బెడ్డింగ్‌ పనులు మాత్ర సదరు సంస్థ స్వయంగా చేపట్టింది. ఇందులో భాగంగా కాలువలో 134, 176, 179, 180, 182 కి.మీ. వద్ద మట్టి తొలగింపు పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభించారు. కానీ రాగులపాడు పంప్‌హౌస్‌ వద్ద హంద్రీ-నీవా కాలువ వెడల్పు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో పాటు 34 ప్యాకేజీలో కాలువను ఎంత మేర వెడల్పు చేయాలో కనీసం మార్కింగ్‌ కూడా వేయలేదు. దీన్ని బట్టి చూస్తే హంద్రీ-నీవా జలాలు అనంత రైతులకు అందాలంటే ఇంకా ఎన్నేళ్లు పడుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.

పనులు వేగవంతానికి చర్యలు
90 రోజుల్లో హంద్రీనీవా ప్రధాన కాలువ వెడల్పు పనులు పూర్తి చేసేందుకు అన్నీ చర్యలు తీసుకుంటాం. పనులపై ఏరోజుకారోజు ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నాము. భారీ యంత్రాలతో పనులు ప్రారంభించాము. పనులు మందకొడిగా జరుగుతున్నాయనుకున్న చోట నిరంతర పర్యవేక్షణతో పనులు వేగవంతమయ్యేలా చూస్తాం.
-రాజశేఖర్‌బాబు, కార్యనిర్వాహక ఇంజనీరు, హంద్రీనీవా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement