చిన్న సందేశం.. పెద్ద సాయం
⇒ ఆపదలో ఉన్న చిన్నారి
⇒ వైద్యానికి యువత చేయూత
నెహ్రూనగర్(గుంటూరు): ఓ చిన్న వాట్సప్ సందేశం ఒక మంచిపనికి మార్గం చూపింది. ఆపదలో ఉన్న ఓ చిన్నారిని ఆదుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన మనోహర్, లావణ్య ఒకటిన్నర ఏళ్ల కుమార్తె జెస్విత ఇటీవల ప్రమాదవశాత్తు మరుగుతున్న నూనెలో పడి తీవ్ర గాయాలపాలయ్యింది. వెంటనే తల్లిదండ్రులు ఎన్‌ఆర్‌ఐ వైద్యశాలకు తరలించగా అక్కడి వైద్యులు చిన్నారి కోలుకోవడానికి రూ.6 లక్షల వరకూ ఖర్చు అవుతుందని తెలిపారు.
దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు ఉండగా సమీప బంధువు ఒకరు చిన్నారికి వచ్చిన ఆపదను వాట్సాప్‌లో తెలిసిన మిత్రులందరికీ పంపించాడు. అలా సామాజిక మాధ్యమంలో సమాచారం అందుకున్న నగరంలోని క్రీస్టియన్‌పేట, పాతగుంటూరుకు చెందిన యువతీ యువకులు ఈస్ట్, వెస్ట్ ప్యారిస్, చర్చిలో విరాళాలు సేకరించి శనివారం రూ.60 వేలు సేకరించారు. నగదును చిన్నారి తల్లిదండ్రులకు అందజేశారు. దాతలెవరైనా వైద్యానికి సాయం చేయాలనుకుంటే 91779 86812, 97007 78345లో సంప్రదించాలని కోరారు.