ప్రాణాలు తీస్తున్న ‘పేక మేడలు’
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఎలాంటి అనుమతుల్లేకుండా అక్రమంగా నిర్మాణాలకు పాల్పడుతున్న నిర్మాణదారులు...అక్రమ నిర్మాణాల్ని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారుల తీరు వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మరోవైపు శిథిల భవనాల విషయంలోనూ ఇదే అశ్రద్ధ వల్ల ఒక్కటొక్కటిగా కూలుతున్న భవనాలతోనూ ప్రాణాలు పోతున్నాయి. ఏళ్ల తరబడిగా పాతుకుపోయిన అవినీతితో జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ సిబ్బంది అందిన కాడికి దండుకుంటున్నారే తప్ప..అనుమతులున్నా లేకున్నా పట్టించుకోవడం లేదు.
నిర్మాణాలు జరుగుతున్నప్పుడు తనిఖీలన్నవే మర్చిపోయారు. వాస్తవానికి నిర్మాణం జరుగుతున్న సమయంలోనూ వివిధ దశల్లో నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు జరుగుతున్నాయా.. లేదా అనేది తనిఖీలు చేయాలి. కానీ..అవేవీ చేయకుండా నిర్మాణం ప్రారంభం కాగానే తమ వాటా తమకు ముట్టిందా లేదా అన్నదానిపైనే శ్రద్ధ చూపుతున్న టౌన్‌ప్లానింగ్ విభాగం తీరుతో అక్రమ నిర్మాణాలు చేసేవారు ఎంత వీలైతే అంత మేర ఆక్రమ నిర్మాణాలు జరుపుతున్నారు. అనుమతి తీసుకున్నా చేతులు తడపాల్సిందే అనే అభిప్రాయం బలపడటంతో అనుమతులున్నా, లేకున్నా అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తున్నారు.
అనుమతులకు మించి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. మొన్న పాతబస్తీ కబూతర్‌ఖానాలో, నిన్న ఫిల్‌్మనగర్ ఎఫ్‌ఎన్‌సీసీలో, తాజాగా కూకట్‌పల్లిలో కమాన్ నిర్మాణంలో జరిగిన ప్రమాదాలు ఇందుకు మచ్చుతునకలు. నిర్మాణాలు జరిపేవారు అనుమతులు తీసుకుంటున్నా..అనుమతులకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టడం లేదు. దాంతో స్ట్రక్చరల్ స్టెబిలిటీని పట్టించుకోకుండా నిర్మాణాలు జరుగుతుండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎఫ్‌ఎన్‌సీసీలో నిర్మాణ లోపాలున్నట్లు జేఎన్‌టీయూ నివేదికలో పేర్కొనడం ఇందుకు తాజా ఉదాహరణ. కూకట్‌పల్లిలో ప్రస్తుతం కూలిన కమాన్ నిర్మాణానికి సైతం టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచి ఎలాంటి అనుతులు తీసుకోలేదు.
అనుతుల్లేకున్నా నిర్మాణాలు చేపట్టవచ్చునని, అధికారులకు ఆమ్యామ్యాలు సమర్పించుకుంటే చాలుననే భావనే ఇందుకు కారణంగా తెలుస్తోంది. నిర్మాణాలు కూలి ప్రమాదాలు జరిగినప్పుడు ఆరా తీస్తే, అసలు అనుమతులే లేకపోవడం.. కొన్ని చోట్ల ఉన్న అనుమతులకు విరుద్ధంగా ఇష్టానుసారం నిర్మాణాలు జరుపుతుండటం వెల్లడవుతున్నాయి. వీరి ఈ చర్యల వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.
శిథిల భవనాలదీ అదే తీరు..
శిథిలభవనాలు ఎప్పుడు కూలతాయో తెలియని పరిస్థితుల్లో ప్రమాదకరంగా ఉన్నాయని గత కొన్ని నెలలుగా పత్రికల్లో కథనాలు వెలువడుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. తీరా వర్షాలు ప్రారంభమయ్యాక జోరున వర్షాలు కురుస్తున్న తరుణంలో శిథిలభవనాలపై చర్యలంటూ కొరడా ఝళిపిస్తున్నారు. ఇటీవలే సికింద్రాబాద్‌లోనే రెండు భవనాలు కూలి ముగ్గురు మృతి చెందడం తెలిసిందే.
కారణాలు.. ?
ప్రమాదాలన్నింటికీ కారణం నిపుణులైన సైట్ ఇంజినీర్లు లేకపోవడం, సెంట్రింగ్ పనుల్లో లోపాలే కారణమని తెలుస్తోంది. వీటికితోడు అనుమతుల్లేని నిర్మాణాలు ప్రమాదాలను పెంచుతున్నాయి. తాజాగా కూకట్‌పల్లిలో ప్రవేశద్వారం వద్ద ఈ బ్లాక్ పక్కన కూలిన ఆర్చికి ఎలాంటి అనుమతి తీసుకోలేదని టౌన్‌ప్లానింగ్ అధికారులు స్పష్టం చేశారు.