
వైభవంగా శోభనాచలుడి శాంతికల్యాణం
ఆగిరిపల్లి : శ్రీశోభనాచల వ్యాఘ్రలక్ష్మీనరసింహస్వామి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి శనివారం శాంతి కల్యాణం, సుదర్శన శాంతి హోమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభనాచలస్వామి వెలసిన కొండ మీద మూడు దేవాలయాల్లో ఉదయం స్వామివారికి నవకలశ పంచామృత స్నపన, విశేష అలంకరణ, శాంతి కల్యాణం, లక్ష్మీనృసింహ సుదర్శన మూలమంత్ర శాంతి హోమం, పూర్ణాహుతిని జరిపారు. ఆగిరిపల్లికి చెందిన వై.చంద్రశేఖర్ మిత్ర బృందం, విజయవాడకు చెందిన టి.కోటేశ్వరరావు దంపతులు, ఈదులగూడేనికి చెందిన చిట్నేని వెంకట శివరామకృష్ణారావు దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు వేదాంతం శేషుబాబు, జి.అనంతకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు. ఆలయ ఈవో జె.రాంబాబు కార్యక్రమాలను పర్యవేక్షించారు.