ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయక్షేత్రం
జగదేవ్‌పూర్(గజ్వేల్): జాతకాలు, ముహూర్తాలను ఎక్కువగా విశ్వసించే ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఆదివారం ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో రాజాశ్యామల హోమం చేయనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం నుంచి మంగళవారం వరకు యాగం నిర్వహించనున్నారు. ఇటీవల చినజీయర్‌స్వామిని కలిసిన కేసీఆర్.. ఫాంహౌస్‌లోనే హోమం చేయాలని నిర్ణయించుకున్నారు. స్వామి వారి శిష్యబృందం వేద పండితులతోనే రాజాశ్యామల హోమం చేపట్టనున్నారు. హోమంలో కేసీఆర్ కుటుంబ సభ్యులతోపాటు ముఖ్య అనుచరులు పాల్గొనే అవకాశం ఉంది. శనివారం సాయంత్రం నుంచే హోమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది.
రాజయోగం.. ప్రజా సంక్షేమం కోసమే...
ఫాంహౌస్‌లో ఆదివారం నిర్వహించే హోమం కేసీఆర్ రాజయోగం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చినజీయర్‌స్వామి జన్మదినం సం దర్భంగా స్వామి హోమం నిర్వహించారు. స్వామిజీ ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ ఈనెల 10న అక్కడికి వెళ్లారు. కేసీఆర్ తన మనసులోని మాటను చినజీయర్‌స్వామికి, వేద పండితులకు వివరించగా మంచి ముహూర్తం చూసి హోమం చేయాలని పండితులు చెప్పగా వారి సూచనలు, సలహాల మేరకు ఆదివారం ఫాంహౌస్‌లో మూడు రోజుల పాటు హోమానికి శ్రీకారం చుట్టారు.
120 మంది ఋత్వికులతో హోమం...
రాజాశ్యామల హోమాన్ని చినజీయర్‌స్వామి శిష్యబృందం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రమే వారంతా ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి హోమం నిర్వహించనున్నట్లు తెలిసింది. ఒకేసారి 120 మంది ఋత్వికులతో హోమం జరగనుంది. హోమంలో కేసీఆర్ దంపతులు పాల్గొని పూజలు చేయనున్నారు. రెండోరోజు కేసీఆర్ కుమారుడు, కుమార్తెలు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అలాగే కుటుంబ సభ్యులతో పాటు ముఖ్య అనుచరులు కూడా పాల్గొననున్నారు.
హోమానికి ముమ్మర ఏర్పాట్లు...
కేసీఆర్ తన వ్యవసాయక్షేత్రంలో ఆదివారం నిర్వహించే రాజాశ్యామల హోమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సాయంత్రం నుంచే ఫాంహౌస్‌లో అన్ని రకాల ఏర్పాట్లలో వేద పండితులు నిమగ్నమయ్యారు. ముందుగానే పండితులు ఫణిశశాంకశర్మ, గోపికృష్ణశర్మలు ఫాంహౌస్‌కు చేరుకుని హోమంకు సంబంధించిన పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. రాత్రి ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కు చేరుకుని హోమం ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిసింది. ఫాంహౌస్‌కు ప్రధాన గేటుకు ఎడమ భాగంలో హోమం నిర్వహించనున్నట్లు తెలిసింది. హోమం చేసేందుకు పందిళ్లు కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment