వాళ్లను వాళ్లే తొక్కుకుని చనిపోయారా!
(సాక్షి వెబ్ ప్రత్యేకం)
ఏడాది గడిచిపోయింది.. అయినా ఆనాటి చేదు జ్ఞాపకాలు ఎవరినీ వదలడం లేదు. గోదావరి పుష్కరాల్లో మొట్టమొదటి రోజునే పుణ్యస్నానం చేయాలని.. అది కూడా రాజమండ్రి అయితేనే పుణ్యఫలం దక్కుతుందని భారీ ఎత్తున ప్రచారం జరిగింది. పన్నెండు కాదు.. పన్నెండు పన్నెండ్లు 144 ఏళ్లకోసారి మాత్రమే వచ్చే మహా పుష్కరాలని, అందువల్ల వీటిలో స్నానం చేయకపోతే ఇక జన్మ జన్మలకు ఆ అవకాశం రాదని కూడా చెప్పారు. అయితే.. కేవలం ఒక్క వ్యక్తి ప్రచార ఆర్భాటం వల్ల ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 29 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ముఖ్యమంత్రి ప్రత్యేకపూజలు చేస్తున్నారని, అందువల్ల భక్తులంతా కాసేపు ఆగాలని చెబుతూ గేట్లు మూసేసి మరీ ఆపేశారు. వందలు కాదు.. వేలాది మంది భక్తులు సరస్వతి ఘాట్ వద్దకు వచ్చారు. అక్కడకు కూతవేటు దూరంలోనే వీవీఐపీ ఘాట్ ఉన్నా కూడా దాన్ని కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరస్వతి ఘాట్ వద్దకే వచ్చారు. ఉదయం 6.00 గంటల నుంచి 7.30 వరకు అంటే, గంటన్నర పాటు ఆయన అక్కడే ఉన్నారు. నిజానికి తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు అక్కడకు చేరుకున్నా, ముఖ్యమంత్రి వస్తున్నారన్న కారణంగా ముందే గేట్లు మూసేసి అందరినీ అక్కడే ఆపేశారు. ముఖ్యమంత్రి వెళ్లీ వెళ్లగానే ఒక్కసారిగా గేట్లు తీయడంతో విపరీతమైన తొక్కిసలాట జరిగింది.. దాంతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. లెక్కలేనంత మంది తీవ్రంగా గాయపడ్డారు. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు.. ఇలా ప్రతి ఒక్కరూ ఊపిరాడక నలిగిపోయారు.
ఇంత జరిగినా.. పుష్కరాల దుర్ఘటనకు ఎవరు బాధ్యులన్న విషయం ఏడాది తర్వాత కూడా తేలలేదు. దీనిపై వేసిన కమిషన్ గడువు రెండుసార్లు పొడిగించినా, చివరకు ఎవరూ ఆ కమిషన్కు సహకరించకపోవడంతో విషయం ఏమీ తేల్చకుండానే వదిలేశారు. దీంతో సోషల్ మీడియా ఈ ఘటన, అనంతర పరిణామాలపై భగ్గుమంది. పుష్కరాల్లో భక్తులు వాళ్లకు వాళ్లే, వాళ్లను వాళ్లే తొక్కుకుని చనిపోయారని.. దీనిపై చంద్రబాబు నాయుడి ప్రభుత్వం మీద బురద జల్లుతూ రాజకీయాలు చేయడం ఎందుకంటూ తమ ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారో నెటిజన్. నిజానికి అదంతా ఫక్తు వెటకారం. ఎలాంటి కారణం లేకుండా భక్తులు తమను తామే తొక్కుకుని చనిపోవడం ఉండదని తనదైన శైలిలో చెప్పారు.
చంద్రబాబు పాలనా తీరుకు దీనికంటే నిదర్శనం అక్కర్లేదని, గోదావరి పుష్కరాలు వెళ్లిపోయి కృష్ణాపుష్కరాలు కూడా వచ్చేస్తున్నా ఇంతవరకు పాత ఘటనకు ఎవరు బాధ్యులో తేల్చడం గానీ, వాళ్లను శిక్షించే ప్రయత్నం గానీ జరగలేదని మరికొందరు వ్యాఖ్యానించారు. ఇంకొందరైతే.. గోదావరి పుష్కరాల సమయంలో ఒక దర్శకుడితో చంద్రబాబు సినిమా షూటింగ్ తీయించుకున్నారని, ఈసారి కృష్ణా పుష్కరాల్లో ఎవరితో సినిమా షూట్ చేయిస్తున్నారని ప్రశ్నించారు. అలాగే సీఎం చంద్రబాబు ఏ పుష్కర ఘాట్లో స్నానం చేస్తున్నదీ ముందుగానే ప్రకటిస్తే.. అటువైపు ఎవరూ వెళ్లకుండా వేరే ఘాట్లు చూసుకుని స్నానాలు చేస్తారని అంటున్నారు. ఇక కృష్ణా పుష్కరాలకు కూడా గతంలో గోదావరి పుష్కరాలకు చేసినట్లుగా ప్రచార ఆర్భాటం చేయకుండా భక్తులను తమ మానాన తాము ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోనివ్వాలని ఇంకొందరు వ్యాఖ్యానించారు. మొత్తమ్మీద సోషల్ మీడియాలో మాత్రం పుష్కరాలు, చంద్రబాబునే టార్గెట్గా చేసుకుంటున్నారు.