నిందితులు నీతూ కుమార్, కృష్ణన్‌కుమార్
సాక్షి, సిటీబ్యూరో: మల్టీ నేషనల్ కంపెనీల్లో భారీ వేతనం వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తామని కుచ్చుటోపీ పెడుతున్న ఇద్దరు ఆన్‌లైన్ నేరగాళ్లను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఘజియాబాద్‌లో అరెస్టుచేసి ట్రాన్సిట్ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. శనివారం సైబరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం... నోయిడాలో నివాసం ఉంటున్న నీతూ కుమార్, కృష్ణన్ కుమార్‌లు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలలోని క్యాప్ జెమినీ తదితర మల్టీ నేషనల్ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ట్రైనీ ఉద్యోగాలు ఉన్నాయని క్వికర్, ఇండీడ్, సైన్.కామ్ వెబ్‌సైట్లలో ప్రకటనలు ఇచ్చారు.
వీటిని చూసి తమను సంప్రదించిన నిరుద్యోగులతో కృష్ణన్ కుమార్ భార్య ఆశా, నీతూ కుమార్ స్నేహితురాలు శిఖా శర్మలు క్రేజీకాల్.నెట్ నుంచి కాలింగ్ ఆప్షన్ ఉపయోగించి మాట్లాడేవారు. బ్యాక్ డోర్‌లో ఈ ఉద్యోగులు ఇప్పిస్తున్నామని, ఇందుకు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందని చెప్పేవారు. అనంతరం ఒక్కో అభ్యర్థి నుంచి రూ. లక్ష నుంచి రూ. లక్షా 20 వేల వరకు తమ బ్యాంక్ ఖాతాల్లో వేయించుకొనేవారు. డబ్బు చెల్లించిన వారికి నకిలీ క్యాప్ జెమినీలో హెచ్‌ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్న రిచా అగర్వాల్ పేరుతో వీరు నకిలీ ఆఫర్ లెటర్లను డబ్బు చెల్లించిన వారికి మెయిల్ చేసేవారు.
వాటిని తీసుకొని క్యాప్ జెమినీకి వెళ్లిన వారికి అసలు విషయం తెలిసి లబోదిబోమనేవారు. ఇలా మోసపోయిన కూకట్‌పల్లికి చెందిన ఓ బాధితుడితో పాటు సైబరాబాద్‌లో మోసపోయిన మరో 17 మంది ఫిబ్రవరి 24న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుల నుంచి బాధితులు చేసిన ఫోన్‌కాల్స్, బ్యాంక్ ఖాతా నెంబర్ల ఆధారంగా నిందితులు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉన్నట్టు ఉంటున్నట్టుగా గుర్తించి సైబర్ ఏసీపీ జయరాం పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలోని బృందం అక్కడికెళ్లింది.
నీతూ కుమార్, కృష్ణన్‌కుమార్‌లను శుక్రవారం అరెస్టు చేసి ట్రాన్సిట్ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చింది. వీరి నుంచి రూ.45 వేల నగదు, ఒక ల్యాప్‌టాప్, నాలుగు సెల్‌ఫోన్లు, చెక్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు కాగా, కరీంనగర్ జిల్లాకు చెందిన సోమేశ్‌రెడ్డి అనే వ్యకి కి ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉందని పోలీసులు భావిస్తున్నారు. బ్యాక్‌డోర్ అపాయింట్‌మెంట్ పేరిట బడా కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వచ్చే కాల్, మెయిల్‌లకు స్పందించరాదని స్టీఫెన్ రవీంద్ర నిరుద్యోగులకు సూచించారు.