- 22న చలో కలెక్టరేట్
ముకరంపుర: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ , జిల్లా అధ్యక్షుడు తాడూరి కరుణాకర్ అన్నారు. హక్కుల సాధన కోసం జర్నలిస్టులు సంఘటితమై శక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఈ నెల 22న తలపెట్టిన చలో కలెక్టరేట్ పోస్టర్‌ను శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆవిష్కరించారు. జర్నలిస్టులకు ఆరోగ్య బీమా జీవో వచ్చేందుకే ఏడాది పట్టిందని, అయినా ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో అమలు కాని దుస్థితి ఉందని అన్నారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులిచ్చి ప్రతీ కార్పొరేట్ ఆస్పత్రిలో అమలయ్యేలా చూడాలన్నారు. ఇళ్లు, స్థలాల హామీ నీటిమూటగానే మిగిలిందన్నారు. అక్రిడిటేషన్ల మార్గదర్శకాల కోసం నియమించిన కమిటీ సూచనలు కూడా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు అందేలా 239 జీవోను సవరించి తక్షణమే జారీ చేయాలన్నారు. సబ్ ఎడిటర్లకు కూడా అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 22న కలెక్టరేట్ ఎదుట వంటావార్పు ద్వారా ప్రభుత్వానికి నిరసన తెలుపుతామన్నారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, రాష్ట్ర, జిల్లా నాయకులు బల్మూరి విజయసింహారావు, ఎలగందుల రవీందర్, అయిలు రమేశ్, శరత్, దూలూరి జగన్మోహన్, పి.ప్రభుదాస్, విజయేందర్‌రెడ్డి, వెంకట్ తదితరులున్నారు.