టీడీపీపై బీజేపీ నేతల ఘాటు వ్యాఖ్యలు
విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న పార్టీ ఫిరాయింపులపై బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యేలను కాదు... ప్రజలను ఆకర్షించాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ... ధరల అదుపుపై లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కందిపప్పు ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు సమస్యలతో అల్లాడుతున్నారని సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ శాసనసభలో బీజేపీ సభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ... ఎమ్మెల్యేల ఫిరాయింపును తమ పార్టీ తరఫున మొదటి నుంచీ విమర్శిస్తున్నామన్నారు. రాజకీయాల్లో ఇది అనైతిక విధానానికి కారణం అవుతుందన్నారు. టీడీపీ నుంచి బీజేపీపై విమర్శలు వస్తున్నందునే వాటికి గట్టిగా సమాధానం ఇస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి పూర్తిస్థాయిలోనే సహాయం అందుతుందని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు.
బీజేపీ కోర్ కమిటీ సమావేశం శుక్రవారం విజయవాడలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ వ్యవహారాల బాధ్యుడు సిద్దార్థనాథ్ సింగ్ హాజరయ్యారు. అలాగే ఆ పార్టీ రాష్ట్ర మంత్రులు పి.మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్తోపాటు పురందేశ్వరి, కావురి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు కూడా హాజరయ్యారు.