- అనారోగ్యంతో ఉన్న తండ్రిని చంపిన తనయుడు
- చికిత్స పేరిట అడవిలోకి తీసుకెళ్లి.. తల పగులగొట్టి ఉరి
- 4 రోజుల తర్వాత వెలుగులోకి
జిన్నారం/హత్నూర: అనారోగ్యంతో ఉన్న తండ్రికి వైద్య ఖర్చులు భరించాల్సి వస్తుందని భావించి ఓ కుమారుడు అతి కిరాతకంగా హత్య చేశాడు. వైద్యం పేరిట అడవిలోకి తీసుకెళ్లి తల పగులగొట్టి.. ఆపై ఉరివేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా హత్నూర మండలం లింగాపూర్‌లో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పూల పోచయ్య(70)కు కుమారుడు భిక్షపతి, కుమార్తె దుర్గమ్మ ఉన్నారు. అతని భార్య రెండేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. కొడుకు, కోడలు, ఇద్దరు మనుమలతో కలసి పోచయ్య గ్రామంలోనే ఉంటున్నాడు. పోచయ్యను భిక్షపతి భారంగా భావించి తరచూ ఘర్షణకు దిగేవాడు.
ఈ క్రమంలో తీవ్ర మనస్తాపం చెందిన పోచయ్య అనారోగ్యానికి గురయ్యాడు. కళ్లు సరిగా కనబడకపోవడంతోపాటు 4 రోజులుగా వాంతులు, విరేచనాలు చేసుకుంటున్నాడు. తీవ్ర అసహనానికి గురైన భిక్షపతి.. హైదరాబాద్‌లో వైద్యం చేయిస్తానని నమ్మబలికి స్నేహితుడు అంజాగౌడ్‌తో కలసి తండ్రిని ఈ నెల 19న బయటకు తీసుకెళ్లాడు. నల్లవల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పోచయ్య తలపై రాయితో మోది, చెట్టుకు ఉరి వేసి వెళ్లిపోయారు. తండ్రి కనిపించకపోవడంతో దుర్గమ్మ ఆరా తీసింది. ఆస్పత్రిలో చూపించిన తర్వాత కనబడలేదని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని భిక్షపతి చెప్పాడు. రెండు రోజులవుతున్నా ఆచూకీ తెలియకపోవడంతో దుర్గమ్మ పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టింది. వారు ఒత్తిడి చేయడంతో అసలు విషయాన్ని చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కుళ్లిపోయిన మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నాడు.
కన్నపేగు కాటేసింది
Published Mon, May 23 2016 10:39 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
Advertisement
Advertisement