సారీ సూర్యా..ఓకే దిగ్గీ
ఒక్క సారీతో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి కోపం తగ్గిపోయిందట. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన సభావేదికపైకి వెళ్లనీయకుండా సూర్యప్రకాశ్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. తననే అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలిగి అక్కడి నుంచి నేరుగా కర్నూలుకు వెళ్లిపోయారు ఆయన.
పార్టీకి చెందిన ముఖ్యనేతలు పొరపాటు జరిగిందని బుజ్జగిస్తున్నా పట్టించుకోకుండా వారిపై తిట్ల పురాణం పఠిస్తూ ఆయన వర్గీయులతో సహా వెళ్లి కర్నూలు కాంగ్రెస్ కార్యాలయానికి తాళం వేశారు. అసలే కాంగ్రెస్ పార్టీ బతకలేని పరిస్థితుల్లో సూర్యప్రకాశ్‌రెడ్డి లాంటి నాయకుడు పార్టీని వీడితే కష్టమని అధిష్టానం భావించింది. విజయవాడలో శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్(దిగ్గీ రాజా) నేతల సమక్షంలోనే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి క్షమాపణ కోరారు. అంతేకాకుండా పార్టీ కార్యక్రమాల్లో తనకు ప్రాధాన్యత ఇవ్వలేదనే కారణంతో సూర్యప్రకాశ్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలపై కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు. దిగ్విజయ్ సింగ్ ఆయనకు సారీ చెప్పడంతో ఇక అసంతప్తి, కోపతాపాలన్నీ కూడా సర్దుకున్నట్లేనని పార్టీలో చర్చించుకుంటున్నారు.