- జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ ఆదేశం
కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : శాంతిభద్రతలకు విఘాతం కల్పించేలా ప్రవర్తిస్తూ హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించవద్దని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ ఆదేశించారు. అమలాపురం సబ్ డివిజినల్ పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశం వివరాలను మంగళవారం కాకినాడలో వెల్లడించారు. రౌడీషీటర్లు ఆధిపత్యం కోసం హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడుతున్న వారిపై రౌడీషీట్లు తెరవాలని ఉత్తర్వులు జారీ చేశామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇటీవల జరిగిన వరుస మహిళా హత్య కేసుల్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించారు.బాహుబలి–2 సినిమా విడుదల సందర్భంగా అమలాపురంలో జరిగిన అల్లర్లు, 13 కార్ల ధ్వంసం కేసుపై ఆయన సమీక్షిస్తూ.. ఈ కేసులో కొంత మంది రౌడీషీటర్ల ప్రమేయం ఉన్నట్లు గుర్తించామన్నారు. విధి నిర్వహణ, కేసుల దర్యాప్తు, ఫిర్యాదు స్వీకరణలో అలసత్వం ప్రదర్శిస్తే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అల్లవరంలో నిర్మించిన నూతన పోలీస్‌స్టేషన్ భవనాన్ని పరిశీలించారు. భవన నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన ఎస్సై డి.ప్రశాంత్‌కుమార్‌ను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్య, సీఐలు జి.దేవకుమార్, వైఆర్‌కే శ్రీనివాస్, కృష్టాఫర్, వెంకటరమణ, పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.