హత్యలతో ఏం సాధించలేరు..
హత్యలతో ఏం సాధించలేరు..
Published Mon, Feb 6 2017 11:16 PM | Last Updated on Tue, Oct 16 2018 2:39 PM
జన జీవన స్రవంతిలో కలవండి
మావోలకు ఎస్పీ రవిప్రకాష్ హితవు
రంపచోడవరం : పోలీస్ ఇన్‌పార్మర్ల అన్న అనుమానంతో గిరిజనులను హత్య చేస్తున్న మావోయిస్టుల చర్యలు హేయమైనవని ఎస్పీ రవిప్రకాష్ అన్నారు. రంపచోడవరం ఏఎస్పీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. అమాయక గిరిజనులను హత్య చేయడం ద్వారా మావోయిస్టులు ఏం సాధించలేరని జనజీవన స్రవంతిలో కలవాలని హితవు చెప్పారు. చింతూరు మండలం అల్లిగూడెంలో ఆదివారం గిరిజనుడు పుల్లయ్యను పోలీస్ ఇన్‌పార్మర్ పేరుతో హత్య చేయడాన్ని ఖండించారు. మావోలు ఉనికిని చాటుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 2007లో అల్లిగూడెంలో జరిగిన గొడవలో పుల్లయ్యను మావోయిస్టులు కొట్టారని, అప్పటినుంచి పుల్లయ్య భద్రాచలం వెళ్లి కూలీ పని చేసుకుంటున్నాడని తెలిపారు. బంధువుల ఇంటిలో శుభకార్యానికి రావడంతో మాటు వేసిన మావోయిస్టులు భోజనం చేస్తున్న అతడిని లాక్కుపోయి తుపాకితో కాల్చి చంపారన్నారు. ఇటీవల కాలంలో ఉనికి కోల్పోయిన మావోలు ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని, అందుకే హత్యలకు తెగబడుతున్నారని విమర్శించారు. మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగలడంంతో వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆయన అన్నారు. మావోలు గిరిజనుల అభివృద్ధికి అడ్డంకిగా మారారని, ఇంటిగ్రేటెడ్ యాక‌్షన్ ప్లాన్‌లో ఏజెన్సీలో రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టినట్టు తెలిపారు. ఏజెన్సీ నుంచి గంజాయి రవాణాను ఆరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. జనమైత్రి ద్వారా గిరిజన గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళుతున్నట్టు వివరించారు. గిరిజన యువతకు ఆర్మీ, పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ అడ్నాన్ నయింఆస్మీ, సీఐలు గీతారామకృష్ణ, ముక్తేశ్వరరావు పాల్గొన్నారు.
Advertisement