విద్యార్థులు ఉన్నతమైన ఆలోచనలతో ఉండాలి
పటమట(విజయవాడ తూర్పు) : విద్యార్థులు ఉన్నతమైన ఆలోచనలుతో భవిష్యత్ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి విద్యార్థి లక్ష్య సాధనవైపు అడుగులు వేయాలని ప్రముఖ కరీంనగర్‌కు చెందిన ప్రతిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హెచ్‌వోడీ ఎల్‌ఎస్‌ఆర్ ప్రసాద్ అన్నారు. మంగళవారం నగరంలోని మారీస్‌స్టెల్లా కళాశాల ఇంగ్లీష్ విభాగం ఆ«ధ్వర్యంలో జాతీయస్థాయిలో జరిగే 'స్పార్క్‌లిట్–2కె17 కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిత్వ వికాసంపై పట్టు సాధించాలని, సమాజంలో ఉన్న వివిధ రకాల వ్యక్తుల స్వభావాలు, ప్రవర్తలను గమనించాలని అన్నారు. విద్యార్థులు ప్రవర్తనను ప్రతి ఒక్కరూ గమనిస్తుంటారని, సమాజంలో ఉన్నతమైన స్థానం సాధించాలంటే వ్యక్తిత్వం కీలకమని అన్నారు. అనంతరం ఆయన వ్యక్తిత్వ నైపుణ్యంపై పలు వీడియోలు, పేపర్ ప్రజంటేషన్‌ను ప్రదర్శించి విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఆయా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సిస్టర్ సిల్వ, ప్రిన్సిపాల్ సిస్టర్ రేఖ, ఆంగ్లవిభాగాధిపతి డాక్టర్ సంధా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గోన్నారు.
ఆకట్టుకున్న కార్యక్రమాలు
జాతీయ స్థాయిలో జరిగే ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు నిర్వహించిన పలు పోటీలు ఆసక్తికరంగా సాగాయి. వర్క్ ఆఫ్ ఫేత్ అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకతను వెలికితీసేలా సాగింది. భాషపై ఉన్న పట్టుత్వాని పరిక్షించేందుకు నిర్వహించిన లిటరసీ మేనియూ–క్విజ్ పోటీలు విద్యార్థుల భాషా ప్రావీణ్యాన్ని నిరూపించింది. సిల్వర్ టంగ్ పేరుతో నిర్వహించిన ఉచ్ఛారణపోటీలు విద్యార్థులకు వ్యాకరణపై ఉన్న ఆసక్తిని వివరించేలా సాగింది. విద్యార్థుల్లో నిఘూడంగా దాగిఉన్న కళాత్మక అంశాన్ని నిరూపించేలా సాగిన మినీ ధియోటర్–ఒన్‌ఆర్ట్‌ప్లే కార్యక్రమం ఆద్యాంతం ఆసక్తికరంగా సాగింది. చివరగా నిర్వహించిన చోర్‌పైప్– సంగీత ప్రదర్శన, రోలీక్లి–నృత్య ప్రదర్శన కార్యక్రమానికి హాజరైనవారిని ఉత్తేజపరిచింది.