విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్
అనంతపురం కల్చరల్ : బీసీ కులాల్లో అత్యంత వెనకబడిన విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.100 కోట్ల నిధులను కేటాయించాలని బ్రహ్మంగారి మఠం ఈశ్వరీ పీఠం శివకుమార్ స్వామీజీ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవాధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది గురుప్రసాద్ నేతృత్వంలో ఆ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. స్థానిక రాణీనగర్‌లోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమానికి శివకుమార్‌స్వామీజీతో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి, జడ్పీ చైర్మన్ చమన్, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ సింహాద్రి కనకాచారి తదితరులు విశిష్ట అతిథులుగా విచ్చేసి మాట్లాడారు.
సంఘం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ తమ జాతిని బీసీ ‘బి’ గ్రూపు నుంచి బీసీ ‘ఎ’ కి మార్చాలని, ప్రమాదవశాత్తు మరణించిన విశ్వబ్రాహ్మణ చేతి వృత్తుల వారికి ప్రభుత్వం రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని, శిల్పశాస్త్ర పరిజ్ఞానమున్న విశ్వబ్రాహ్మణులను ఆలయ ధర్మకర్తలుగా నియమించాలని డిమాండ్ చేశారు. అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు ఆచారి, చంద్రశేఖారాచారి, రంగాచారి, విశ్వబ్రాహ్మణ పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకులు పూలకుంట రమణాచారి, హనుమంతాచారి తదితరులు పాల్గొన్నారు.