‘గ్యాంగ్‌స్టర్’మూలాల కోసం వేట | Special Investigation Team (SIT) gangster nayeem case | Sakshi
Sakshi News home page

‘గ్యాంగ్‌స్టర్’మూలాల కోసం వేట

Published Fri, Aug 26 2016 8:07 PM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM

‘గ్యాంగ్‌స్టర్’మూలాల కోసం వేట - Sakshi

‘గ్యాంగ్‌స్టర్’మూలాల కోసం వేట

గ్యాంగ్‌స్టర్ సన్నిహితులెవరనే దానిపై నజర్
 ‘కూరపాటి’ని టార్గెట్ చేయడంపై ‘సిట్’ ఆరా
 విచారణలో వెలుగు చూడనున్న అసలు ‘కథ’

 
సాక్షి ప్రతినిధి నిజామాబాద్ :  జిల్లాలో గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్‌కు అత్యంత సన్నిహితులు ఎవరు? డిచ్‌పల్లి జెడ్పీటీసీ కూరపాటి అరుణ భర్త గంగాధర్‌ను ఆ గ్యాంగ్ కు టార్గెట్ చేసిందెవరు? ఎంతకాలంగా జిల్లాలో నయీం ముఠా కార్యకలాపాలు సాగిస్తోంది? ఈ ముఠాకు ఇన్నాళ్లు సహకరిస్తున్నదెవరు? అన్న అంశాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) రెండు రోజులుగా జిల్లాలో    ఆరా తీస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. నల్గొండ జిల్లా భువనగిరి ఠాణాలో తెలంగాణ రైసుమిల్లర్ల సంఘం అధ్యక్షుడు గంపా నాగేందర్ ఈ నెల 17న శాసనమండలి డిప్యూటీ చైర్మన్, నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌పై ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఈ మేరకు ఆయనపై క్రైం నంబర్ 234/2016 ప్రకారం  ఎఫ్‌ఐఆర్ జారీ అయిన అనంతరం జిల్లాలో ‘సిట్’ దర్యాప్తు ముమ్మరం చేయడం కలకలం రేపుతోంది. నేతి విద్యాసాగర్‌కు  బంధువులు, సన్నిహితులు, వారి గత చరిత్రపై ఆరా తీస్తుండటం జిల్లాలో చర్చనీయాంశం అవుతోంది.
 
  ‘కూరపాటి’ని టార్గెట్ చేసిందెవరు?
 గ్యాంగ్ స్టర్ నయీంపై డిచ్‌పల్లి పోలీసుస్టేషన్‌లో నమోదైన క్రైం నంబర్ 125/2016. నల్గొండ జిల్లాలో అనేక ఆగడాలు కొనసాగించిన నయీం డిచ్‌పల్లి జెడ్పీటీసీ భర్తపై బెదిరింపులకు పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లాలో మొదటిసారి నయీం డబ్బుల కోసం బెదిరించడం జరిగింది. గంగాధర్‌కు సంబంధించి ఆస్తులు, వ్యక్తిగత వివరాలు నయీం పేర్కొన్నడం సంచలనం రేపింది. దీనిని బట్టి నయీంకు జిల్లా పరిస్థితులు, స్థానికంగా వివరాలు తెలిసిన వారే అనుచరులుగా కొనసాగుతున్నట్లు అనుమానాలకు తావిస్తోంది. నయీంకు కూరపాటి గంగాధర్‌కు సంబంధించి వివరాలు అందించింది ఎవరు? అసలు ఆయనను ఎందుకు టార్గెట్ చేశారు? అన్న అంశాలే ఇప్పుడు కీలకంగా మారాయి.
 
నల్గొండ జిల్లా భువనగిరి పోలీసుస్టేషన్‌లో నేతి విద్యాసాగర్‌పై కేసు నమోదైన నేపథ్యంలో.. సిట్ జిల్లాలోని ఆయన బంధువర్గం వివరాలు ఆరా తీయడం కలకలం రేపుతోంది. నల్కొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీకి సమీప బంధువు దీంతో సిట్ జిల్లాలోని నయీం బెదిరింపు కాల్స్‌కు సంబంధించి ఆరా తీయనుంది. ఒకవేళ సదరు ప్రజాప్రతినిధి డిచ్‌పల్లి గంగాధర్‌కు చెందిన వివరాలు అందించారా? రాజకీయ లబ్ధి కోసం గంగాధర్‌ను భయపెట్టేందుకు చేసిందా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా నయీం అనుచరులు ఎవరెవరు ఉన్నారు? ఎక్కడెక్కడ ఉన్నారు? అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
 
 నయూం మూలాలపై త్వరలో నివేదిక
 డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లోనే కేసు నమోదు కావడంతో ఒక్కొక్కరిపై సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, ఇతర ప్రాంతాల్లో కూడా పరిస్థితి ఏమిటన్న చర్చ జరుగుతోంది. భువనగిరి ఠాణాలో ఎఫ్‌ఐఆర్ నమోదైన నల్గొండ ఎమ్మెల్సీ సమీప బంధువు జిల్లాలో సెటిల్‌మెంట్లు చేయడం పరిపాటి. ఇప్పటికీ ఉన్నతస్థాయి కోర్టు కేసులు ఎదుర్కొంటున్న అయన  2019 ఎన్నికలు లక్ష్యంగా కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం కూడా చేస్తున్నట్లు ప్రచారం ఉంది.
 
ఇదే క్రమంలో నయీంతో సంబంధాలు పెట్టుకొని జిల్లాలో మరిన్ని సెటిల్‌మెంట్లు చేసేందుకు పూనుకున్నడా? కూరపాటిని టార్గెట్ చేయడం ద్వారా.. ఆయన సీనియర్ నాయకులకు హెచ్చరిక చేయదలచుకున్నాడా? ఈ క్రమంలోనే గ్యాంగ్‌స్టర్‌గా గడగడలాడించిన నయీంతో జత కట్టాడా? అన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో రాజకీయంగా పట్టుసాధించే క్రమంలో నయీం గ్యాంగ్‌ను దగ్గరయ్యాడా? అన్న వాదన కూడా సాగుతోంది.
 
 కాగా వీటన్నింటిని పక్కన బెడితే ‘సిట్’ పూర్తి స్థాయి విచారణ జరిపితే జిల్లాలో నయీం అనుచరుల ఎవరెవరు? ఒక వేళ నయీం కూడా నిజామాబాద్ వచ్చి వెళ్లేవాడా? వచ్చి వెళితే నయీంకు ఆశ్రయం కల్పించిన వారెవరు? అతని వెంట ఎవరెవరు ఉన్నది? అన్న విషయాల గుట్టు వెలుగులోకి రానుంది. గుట్టు చప్పుడు కాకుండా నయీం కార్యకలాపాలు కొనసాగించేవాడన్నది బహిరంగ రహస్యమే అయినా... జిల్లాలో నయీం మూలాలు ఎక్కడనేది? తేల్చే పనిలో ఇప్పుడు సిట్ నిమగ్నమైంది. త్వరలోనే  నాగిరెడ్డి నేతృత్వంలోని సిట్ బృందం జిల్లాకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి తీసుక రానుందన్న చర్చ రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement