బీఎస్‌ఎన్‌ఎల్ ప్రత్యేక ఆఫర్లు
♦ సంస్థ ఖమ్మం ప్రిన్సిపల్
♦ జనరల్ మేనేజర్ పద్మనాభం
ఖమ్మంమయూరిసెంటర్:
ప్రైవేటు నెట్‌వర్క్‌ల పోటీని తట్టుకొని వినియోదారులకు ప్రత్యేక సేవలను అందిస్తూ వారిని ఆకర్షించేందుకు నూతన ఆఫర్లను బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చిందని సంస్థ ఖమ్మం ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పెట్లు పద్మనాభం పేర్కొన్నారు. మంగళవారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఎస్‌ఎన్‌ఎల్ ప్రతి ప్రొడక్ట్‌ను మార్కెట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమన్నారు. రూ.429 ప్లాన్‌తో వినియోగదారులకు 180 రోజుల వ్యాలిడిటీతో పాటు 90 రోజులు రోజుకు 1 బీజీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఇస్తున్నట్లు తెలిపారు.
రూ.333తో 56 రోజులు రోజుకు 1 జీబీ డేటా ఆఫర్ ఉందన్నారు. వినియోగదారులకు ఉత్తమమైన నెట్‌వర్క్ సేవలను అందించేందుకు 6 నెలల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన సాంకేతిక సర్వీసులతో టవర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. న్యూ జనరేషన్ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ఇప్పటికే ఫ్రీవైఫై సౌకర్యాలను ఏర్పాటు చేశామని వాటిని రూరల్ ప్రాంతాల్లో కూడా విస్తరిస్తున్నట్లు చెప్పారు. ఈవైఫై ద్వారా అర్బన్‌లో ఒక వినియోగదారుడు రిజిస్ట్రర్ అయిన వెంటనే 100 ఎంబీ ఫ్రీగా ఇవ్వనున్నామని, రూరల్ ప్రాంతాల్లో 4 జీబీ ఫ్రీగా ఇవ్వనున్నామని పేర్కొన్నారు.
మ్యూచ్‌వల్ ల్యాండ్‌లైన్ పథకంతో పాత ల్యాండ్‌లైన్ నంబర్‌పైనే రూ.99 చెల్లిస్తే ఏడాదిపాటు ఆ నంబర్‌తోనే మొబైల్‌కు ఇన్‌కమింగ్ కాల్స్ వచ్చే సౌకర్యం కల్పిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా స్వచ్ఛత మిషన్ పథకాన్ని తీసుకొచ్చిందని వివరించారు. ఈ పథకం ద్వారా సంస్థ ప్రజలకు ఉపయోగపడేలా టాయిలెట్లు నిర్మించనుందని, జిల్లాలో నేలకొండపల్లి, కూసుమంచి, మధిర ఎక్సేంజ్‌లలో ముందుగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీజీఎం ఫైనాన్స్ మంచా, ఎస్‌డీ ఆపరేటర్ తాటి శ్రీనివాస్, ఎస్‌డీఈ ప్లానింగ్ ఎ.సత్యప్రసాద్, సిబ్బంది వి.సత్యనారాయణ, గోవింద్, తిరుమలాచార్యులు తదితరులు పాల్గొన్నారు.