
నిత్యకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
భద్రాచలం : శ్రీసీతారామచంద్ర స్వామి వారికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు చేశారు. పవిత్ర గోదావరి నదీ నుంచి తీర్థ జలాలను తెచ్చి స్వామివారికి భద్రుని గుడిలో అభిషేకం చేపట్టారు. నిత్యకల్యాణ మూర్తులను ఆలయ బేడా మండపంలో వేంచేయింపజేసి.. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ గావించారు. స్వామివారి, అమ్మవార్ల వంశక్రమాన్ని భక్తులకు తెలియజేసి.. ఆలయ విశిష్టతను భక్తులకు వివరించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామివారికి విన్నవించారు. అనంతరం వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత వైభవోపేతంగా స్వామివారికి నిత్యకల్యాణం చేశారు. అర్చకులు స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.