అయోధ్యలోని రామాలయానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. రామభక్తులు బాలరామునికి విరాళాలు, కానుకలు విరివిగా అందజేస్తున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మాధ్యమాలలో భక్తులు నూతన రామాలయానికి విరాళాలు అందజేస్తున్నారు.
జనవరి 23 నుంచి సామాన్య భక్తులను రామాలయ సందర్శనకు అనుమతించినది మొదలు భక్తులు బారులు తీరుతున్నారు. గడచిన పది రోజుల్లో బాలరామునికి దాదాపు రూ.12 కోట్ల మేరకు విరాళాలు అందాయి. జనవరి 22న రామ్‌లల్లాకు పట్టాభిషేకం జరిగిన రోజున వేడుకకు హాజరైన ఎనిమిది వేల మంది అతిథులు భారీగా విరాళాలు సమర్పించారు. జనవరి 22న ఒక్కరోజునే రామ్‌లల్లా రూ.3.17 కోట్ల విరాళాన్ని అందుకున్నాడు.
ముఖ్యమంత్రి యోగితో పాటు బీజేపీ ఎమ్మెల్యేలంతా ఫిబ్రవరి 11న రామ్‌లల్లాను దర్శించుకోనున్నారు. అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానాతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఆరోజున శ్రీరాముని దర్శించుకోనున్నారు. మరోవైపు రామాలయంలో ఏడాది పొడవునా జరిగే ఉత్సవాల జాబితాను సిద్ధం చేశారు. ఫిబ్రవరి 14న జరిగే వసంత పంచమి నూతన రామాలయంలో నిర్వహించే మొదటి ఉత్సవం కానుంది. ఆరోజు ఆలయంలో సరస్వతీ మాతను పూజించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. రామాలయంలో ఏడాది పొడవునా 12 ప్రధాన పండుగలు, ఉత్సవాలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment