ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
Published Sat, Feb 4 2017 9:51 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
– వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి
– హోదా కోరుతూ విద్యార్థి విభాగం నిరాహార దీక్షలు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. శనివారం స్థానిక శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద వైఎస్‌ఆర్‌సీపీ స్టూడెంట్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్, నగర అధ్యక్షుడు గోపినాథ్ నేతృత్వంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. హోదా సాధించేంత వరకు వైస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. విభజన సమయంలో ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని బీజేపీ నాయకులు, 15 ఏళ్లు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారన్నారు. అప్పటి మాటలను టీడీపీ, బీజీపీ నేతలు విస్మరించి హోదాతో ఒరిగేదేమీ లేదని మాట్లాడడం దారుణమన్నారు. ప్రత్యేక హోదాను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి..చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారన్నారు. స్వార్థ రాజకీయాల కోసం హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు. సొంత సంపాదన తప్ప.. రాష్ట్రం కోసం సీఎం చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను తెలుసుకుని విద్యార్థులు హోదా కోసం దీక్ష చేపట్టడం అభినందనీయమన్నారు.
పలువురి మద్దతు...
రిలే దీక్షలకు వైఎస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, యూత్ జిల్లా అధ్యక్షుడు పి.రాజావిష్ణువర్దన్‌రెడ్డి నేతృత్వంలో యువజనులు, ట్రేడ్‌యూనియన్ జిల్లా అధ్యక్షుడు టి.వి.రమణ నేతృత్వంలో కార్మికులు, మహిళా విభాగం అధ్యక్ష కార్యదర్శులు శౌరి విజయకుమారి, సలోమి నేతృత్వంలో మహిళలు మద్దతు నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షలు, ధర్నాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఐదుకోట్ల ఆంధ్రులు హోదాను కోరుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. సాయంత్రం 5.00 గంటలకు పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ..విద్యార్థులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
దీక్షల్లో కూర్చున్న వారు వీరే..
అనిల్, గోపి, సందీప్, లోకేశ్, ఆనంద్, భూపతి, షాలి, సతీశ్, ప్రదీప్, సతీష్, సునీల్, సంజు, వినోద్, భరత్, విక్రమ్, కుమార్, షాష, గోవింద్, పృధ్వీ, చంటి.
సంఘీభావం..
ట్రైబల్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప, అంబేడ్కర్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్ దీక్షలకు సంఘీభావం తెలిపారు కార్యక్రమంలో నగర నాయకులు ఈశ్వర్, మునాఫ్, అహ్మద్, బుజ్జి, సాంబ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement