ప్రత్యేక హోదా కోసం పోరాటం ఆగదు
కోటగుమ్మం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకూ తమ పోరాటం ఆగదని సామాజిక హక్కుల వేదిక చైర్మన్ వేణుగోపాల్, జిల్లా కన్వీనర్ తాటిపాక మధు అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రయివేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లా¯న్ నిధులు దుర్వినియోగం చేయవద్దని, బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. వాటి సాధన కు వేదిక ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ నుంచి జీపు జాతా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా రాజకీయ జెండాలు పక్కనపెట్టి దళిత, గిరిజన, బలహీనవర్గాలు, మైనార్టీ సమస్యలపై పోరుబాట పట్టామన్నారు. 2011 నుంచి ఇప్పటి వరకూ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కృష్ణా ప్రాజెక్టు, ఆర్ అండ్ బీ రహదారులకు, పార్కులకు ఖర్చు పెట్టి నిధులు దుర్వినియోగం చేశారని విమర్శించారు. గత ఎన్నికల ముందు నారా చంద్రబాబు బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకూ ఆ ఊసే లేదన్నారు. రంపచోడవరం గిరిజన యూనివర్సిటీని నెలకొల్పాలని, ఏజెన్సీ ప్రాంతాన్ని అల్లూరి జిల్లాగా ప్రకటించాలని కోరారు. జీపుజాతా ప్రారంభానికి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఎమ్మెల్సీ సుభాష్‌చంద్రబోస్‌తో పాటు ఇతర వర్గాల ప్రముఖులు హాజరవుతారని వివరించారు. నవంబర్ 9న కాకినాడ కలెక్టరేట్ వద్ద పోరుగర్జన నిర్వహిస్తున్నట్టు తెలిపారు.