వైఎస్‌ఆర్ క్రీడాపాఠశాల రాష్ట్రస్థాయి ఎంపికలు వాయిదా
కడప స్పోర్ట్స్ :
డాక్టర్ వైఎస్‌ఆర్ క్రీడాపాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే రాష్ట్రస్థాయి క్రీడాఎంపికలను వాయిదా వేసినట్లు వైఎస్‌ఆర్ క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి సయ్యద్‌సాహెబ్ ఒక ప్రకటనలో తెలిపారు. కెనెడియన్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు నిర్వహించాలని శాప్ నుంచి ఉత్తర్వులు రావడంతో ఈ ఎంపికలను వాయిదా వేసినట్లు తెలిపారు. ఈనెల 27 నుంచి నిర్వహించాల్సిన ఈ ఎంపికలను ఆగస్టు మొదటివారానికి వాయిదా వేసినట్లు తెలిపారు. ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులకు అసెస్‌మెంట్ ట్రైనింగ్ (రెసిడెన్షియల్) ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం 6వ తేదీ రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహించి ప్రవేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కావున ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.
క్రీడాపాఠశాల లోగోకు కాంపిటీషన్స్
డాక్టర్ వైఎస్‌ఆర్ క్రీడాపాఠశాలకు లోగో (చిహ్నం) ఏర్పాటు చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి లోగోను రూపొందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి సయ్యద్‌సాహెబ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తాము రూపొందించిన లోగోలను ఆగస్టు 1వ తేదీలోపు వైఎస్‌ఆర్ క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి కార్యాలయానికి చేరేలా చూడాలన్నారు. ఎంపికైన తొలి మూడు లోగోలు రూపొందించిన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు.