మెడిసినల్ బాల్ త్రో చేస్తున్న చిన్నారి
ఉత్సాహంగా స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు
Published Fri, Jul 22 2016 12:13 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
– తరలివచ్చిన బాలబాలికలు
– త్వరలో జిల్లాస్థాయి తుది ఎంపిక జాబితా వెల్లడి
శ్రీకాకుళం న్యూకాలనీ: స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల ఎంపికలు ఉత్సాహంగా.. ఉల్లాసభరితంగా సాగాయి. చిరుజల్లులు, ఆహ్లాదరకమైన వాతావరణంలో క్రీడాకారుల ఎంపికలు కోలాహలంగా సాగాయి. వైఎస్సాఆర్ కడప జిల్లాలోని వైఎస్ రాజశేఖరరెడ్డి స్పోర్ట్స్ స్కూల్‌లో 4వ తరగతి ప్రవేశాలకు గాను శాప్ సౌజన్యంతో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం జిల్లాస్థాయి ఎంపికలను నిర్వహించారు. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి దాదాపు 80 మంది వరకు బాలబాలికలు హాజరయ్యారు. ఎంపికలకు హాజరైన బాలబాలికల్లో తొలుత నిర్ధేశించిన వయో పరిమితి లోబడి ఉన్న క్రీడాకారులను మాత్రమే ఎంపికలకు అనుమతించారు. అర్హత కలిగిన బాలబాలికలకు వారి ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లైస్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్‌జంప్, వెర్టికల్‌జంప్, మెడిసిన్ బాల్‌త్రో, షటిల్‌రన్, ఫ్లెక్సిబులిటీ టెస్ట్, 800 మీటర్ల పరుగును నిర్వహించారు. వారి గణాంకాలను, టైమింగ్‌లను అధికారులు నమోదు చేసుకున్నారు. కాగా ప్రభుత్వం అరకొన నిధులను కేటాయించినప్పటికీ ఎంపికలకు హాజరైన బాలబాలికలకు అధికారులు మెరుగైన సౌకర్యాలు కల్పించారు.
శాప్ నిర్థేశానుసారం ఎంపిక
ఇదిలా ఉండగా శాప్ నిర్థేశించిన టైమింగ్, ఫలితాలను సాధించిన క్రీడాకారులను మాత్రమే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చే స్తామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్ వెల్లడించారు. జిల్లాస్థాయిలో ఎంపికైన క్రీడాకారుల జాబితాను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఎంపికలో జిల్లా పీఈటీ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు వై.పోలినాయుడు, ఎం.సాంబమూర్తి, ఎంవీ రమణ, ఎమ్మెస్సీ శేఖర్, బీవీ రమణ, సుజాత, ఎం.ఆనంద్‌కిరణ్, మాధవరావు, రవి, డీఎస్‌ఏ కోచ్‌లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Advertisement