
మాట్లాడుతున్న ఈవో సాంబశివరావు
– టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు
– జూలైలో 97.09 కోట్ల హుండీకానుకలు, 6.27 లక్షల మందికి రూ.300 టికెట్ల దర్శనం
సాక్షి,తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి అక్టోబరు 1 నుండి 31వ తేది వరకు మొత్తం 40,087 టికెట్లు విడుదల చేసినట్టు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో వెల్లడించారు. ఇందులో సుప్రభాతం 5477, అర్చన 80, తోమాల 80, విశేష పూజ 1125, అష్టదళ పాద పద్మారాధన సేవ 40, నిజపాద దర్శనం1125, కల్యాణోత్సవం 7875, వసంతోత్సవం8170, ఆర్జిత బ్రహ్మోత్సవం 4515, సహస్రదీపాలంకారసేవ 9500, ఊంజల్‌సేవ 2100 టికెట్లు ఉన్నాయన్నారు. జూలైలో రికార్డు స్థాయిలో రూ.300 టికెట్ల క్యూలో ద్వారా 6.27 లక్షలు మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని, S హుండీ కానుకలు కూడా రూ.97.09 కోట్లు లభించటం రికార్డన్నారు. టీటీడీ పథకాలకు విరాళాలిచ్చిన దాతలకు ఆగస్టు 15వ తేదిలోగా ఈ పాసులు బుక్‌లు అందజేస్తామన్నారు. కృష్ణాపుష్కరాల్లో నమూనా ఆలయంలో స్వామివారి ప్యాకట్ సైజ్ ఫొటోలు ఉచితంగా పంపిణీ చేస్తామని, 5,10 గ్రాముల శ్రీవారి రాగి డాలర్లు విక్రయిస్తామన్నారు. నమూనా ఆలయంలో రోజూ అత్యధిక మంది భక్తులకు దర్శనం, అన్నప్రసాదం వితరణ చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు.