ఆర్టీసీ ప్రయాణికులకు ‘శ్రీవారి దర్శనం’ టికెట్లు | srivari darsan tikets alloted rtc pilligrams | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ప్రయాణికులకు ‘శ్రీవారి దర్శనం’ టికెట్లు

Published Wed, Jul 27 2016 11:24 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

ఆర్టీసీ గరుడ బస్సు

ఆర్టీసీ గరుడ బస్సు

రిజర్వేషన్‌ చేసుకున్న వారికి రూ.300 దర్శనం టికెట్లు
చిత్తూరు జిల్లా బస్సులకు మాత్రమే వర్తింపు
31న ప్రయోగాత్మకంగా అమలు

తిరుపతి అర్బన్‌: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లను అందజేసే ప్రక్రియకు సంస్థ ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. అన్నీ సజావుగా సాగితే ఈ నెల 31 నుంచే ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తు రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే స్వామివారి రూ.300 దర్శనం టికెట్లను అందజేయనున్నారు. చిత్తూరు జిల్లాలోని డిపోల బస్సుల్లో ప్రయాణించే వారికి మాత్రమే ఈ సౌకర్యం కల్పించనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
 
ఏయే ప్రాంతాలు, ఏయే బస్సుల్లో..
 ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై నగరాల నుంచి బయల్దేరే  చిత్తూరు జిల్లాల డిపో బస్సుల్లో మాత్రమే టీటీడీ దర్శనం టికెట్లు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ నాగశివుడు తెలిపారు. సూపర్‌ లగ్జరీ, ఇంద్రా, అమరావతి, గరుడ, గరుడ ప్లస్‌ బస్సుల్లో మాత్రమే ప్రస్తుతానికి రూ.300 దర్శనం టికెట్లు అందేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు.

టికెట్ల జారీ విధానం ఇలా..
పై ఐదు నగరాల నుంచి బయల్దేరే చిత్తూరు జిల్లా ఆర్టీసీ డిపో బస్సుల్లో ప్రయాణించాలనుకుని రిజర్వేషన్‌ చేసుకునే వారు తమ బస్సు రిజర్వేషన్‌తో పాటు సంబంధిత కౌంటర్‌లో టీటీడీ రూ.300 దర్శనం టికెట్‌ కోసం డిమాండ్‌ చేయాలి. ఆర్టీసీ బస్సు టికెట్‌లోనే ఈ దర్శనం సౌలభ్యం కూడా కల్పించే విధంగా నగదు లావాదేవీ వివరాలు పొందుపరిచి ఉంటాయి. కానీ ప్రయాణికుడు ఏ తేదీకి స్వామివారి దర్శనం కావాలో బస్సు టికెట్‌ రిజర్వేషన్‌ సందర్భంలో స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఆ విధంగా దర్శన టికెట్‌ బుక్‌ చేసుకున్న వారికి ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు రెండుసార్లుగా ప్రత్యేక దర్శనం సౌకర్యం కల్పిస్తారు.

రెండు స్లాట్‌లకు వెయ్యి టికెట్లు
ప్రతిరోజూ ఉదయం 11 గంటలు, సాయంత్రం 4 గంటల స్లాట్‌లకు కలిపి టీటీడీ ఇప్పటికి వెయ్యి టికెట్లు మాత్రమే కేటాయిస్తోంది. వాటిని ఉదయం స్లాట్‌కు 600, సాయంత్రం స్లాట్‌కు 400గా విభజించారు. అందుకు అనుగుణంగానే ప్రయాణికులు బస్సు రిజర్వేషన్‌తో పాటు దర్శనం టికెట్‌ను బుక్‌ చేసుకోవాలి.
- నాగశివుడు, ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్, తిరుపతి
 
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement