నారాయణ కళాశాలలో దాష్టీకం
వసతులపై ప్రశ్నించిన విద్యార్థులను చితకబాదిన వైనం
– ప్రిన్సిపాల్, ఇన్‌చార్జ్‌లు మద్యం మత్తులో కొట్టారని ఆరోపణ
– దెబ్బలు భరించలేక రోడ్డెక్కిన విద్యార్థులు
అనంతపురం ఎడ్యుకేషన్ : నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో మౌలిక వసతులపై ప్రశ్నించిన పాపానికి ఒంటిపై వాతలు పడేలా చావబాదిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. బాధిత విద్యార్థులు తెలిపిన మేరకు వివరాలిలా.. నగరంలోని టీవీ టవర్ సమీపంలో ఉన్న నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో సతీష్, జీవన్, అరుణ్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. హాస్టల్‌లో వసతులు చాలా అధ్వానంగా ఉన్నాయని, మెస్‌లో అన్నం తినలేని పరిస్థితి ఉందంటూ విద్యార్థులు బుధవారం యాజమాన్యాన్ని ప్రశ్నించారు. కుళ్లిన కూరగాయలతో కూరలు చేస్తున్నారని, బాత్‌రూంలు లేవని, మరుగుదొడ్లలో స్నానం చేయాల్సిన దుస్థితి అని వాపోయారు. వీరి ముగ్గురితో పాటు మరికొందరు విద్యార్థులు ఇవే సమస్యలను లేవనెత్తారు.
అయితే రాత్రి 10.30 గంటల సమయంలో మద్యంమత్తులోని ప్రిన్సిపాల్ శిఖామణి, ఇన్‌చార్జ్‌లు భవాని, శ్రీనివాసరెడ్డి విద్యార్థులు సతీష్, జీవన్, అరుణ్‌లను కట్టెలతో చితక్కొట్టారు. మమ్మల్నే ప్రశ్నిస్తారా? అంటూ దాడి చేసినట్లు విద్యార్థులు కన్నీటి ³పర్యంతమయ్యారు. విషయం బయటకు చెబితే టీసీ ఇచ్చి పంపుతామని.. బయట ఏ కళాశాలలోనూ చేర్చుకోకుండా చేస్తామంటూ భయపెట్టారు. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపిన విద్యార్థులు గురువారం ఉదయం సమాచారాన్ని మీడియా, విద్యార్థి సంఘాలకు చేరవేశారు.
కళాశాలకు చేరుకున్న మీడియా, విద్యార్థి సంఘాలు విద్యార్థులను పరిశీలించగా కందిపోయిన దెబ్బలు కనిపించాయి. కళాశాలలో చాలా హీనంగా చూస్తున్నారని, తల్లిదండ్రులు బాధపడతారనే ఉద్దేశంతో బయటకు చెప్పలేకపోతున్నట్లు విద్యార్థులు వాపోయారు. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థి నేతలకు పోలీసులు సర్దిచెప్పారు. బాధిత విద్యార్థుల నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం వ్యవహారంపై ప్రిన్సిపాల్ శిఖామణిని వివరణ కోరగా పిల్లలు అల్లరి చేస్తుండటంతో మందలించామన్నారు.