నేడు సెకండ్ ఇంటర్ సీఈసీలో సఫియా స్టేట్ ఫస్ట్
హిందూపురం: ఆరు, తొమ్మిదో తరగతి చదువుతున్నపుడు ఆ అమ్మాయిని చదువు వద్దని చెప్పి ఇంట్లో వాళ్లు మాన్పించడానికి ప్రయత్నించారు. అయితే నేడు అదే అమ్మాయి ఇంటర్ సెకండియర్ సీఈసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వరూపరాణి చొరవతో మళ్లీ తనను చదివించారని, మొదటి ర్యాంకు సాధించినందుకు సంతోషంగా ఉందని ఆ విద్యార్థిని సంతోషం వ్యక్తం చేసింది. అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని మేళాపురానికి చెందిన ఖలీల్‌ఖాన్, జాహెదాల కూతురు సఫియా ఖానమ్ ఇంటర్ సెకండియర్ సీఈసీలో 970 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంకు సాధించింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలయేసు కళాశాలలో చదువుతున్న తాను మొదటి సంవత్సరంలో 487 మార్కులు సాధించి రాష్ట్రంలో మూడో ర్యాంకు సాధించానంది. ఇందుకు బాలయేసు కళాశాల ప్రిన్సిపాల్ బలరామిరెడ్డి, అధ్యాపకులతోపాటు ప్రధానోపాధ్యాయురాలు స్వరూపారాణిల ప్రోత్సాహమే కారణమని చెప్పింది. బాగా చదివి అధ్యాపకురాలినై తనలాంటి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దుతానని తెలిపింది. కళాశాల యాజమాన్యం విద్యార్థినికి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలియజేశారు.