హోదాపై ప్రశ్నించలేని రాష్ట్ర ప్రభుత్వం
హోదాపై ప్రశ్నించలేని రాష్ట్ర ప్రభుత్వం
Published Wed, Sep 7 2016 10:19 PM | Last Updated on Tue, May 29 2018 3:42 PM
జంగారెడ్డిగూడెం రూరల్: ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం ఏ ప్రకటన చేస్తుందోనని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం తన స్వప్రయోజనాల కోసం ఆలోచిస్తూ రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టుపెట్టే పనిలో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని విమర్శించారు. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా వస్తుందా రాదా అనే ఆందోళనలో రాష్ట్ర ప్రజలు ఉంటే సీఎం చంద్రబాబు మాత్రం ప్రశాంతంగా మంత్రివర్గ సహచరులతో మంతనాలు జరుపుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాయే కావాలని కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని టీడీపీ మంత్రులను రాజీనామా చేయించి అల్టిమేటం జారీ చేస్తేనే హోదా విషయంలో స్పష్టమైన హామీ వస్తుందన్నారు. ఇదే ప్రజల అభిమతమని ఈ దిశగా ఒత్తిడి చేసే ప్రయత్నం చేయాలని కోరారు.
ప్రజలను మభ్యపెట్టడమే.. ప్రజలను మభ్యపెట్టేందుకు మహిళలను కూడా కించపరిచేందుకు చంద్రబాబు ఏమాత్రం వెనుకాడటం లేదని నాని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో ఎక్కడ అరెస్టు కావాలనే భయంతోనే హోదాపై నోరు మెదపడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడితే ఊరుకునేది లేదని తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులంతా తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకోం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు ఎలా బనాయించాలనే కార్యక్రమాలను సీఎం చంద్రబాబు చేస్తున్నారని ఆరోపించారు. కాపులకు న్యాయం చేయాలంటూ ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభంకు కరుణాకరరెడ్డి మద్దతు ప్రకటించారు తప్ప తుని విధ్వంసంలో ఆయనకు సంబంధం లేదన్నారు. అయితే ఇప్పుడు కరుణాకరరెడ్డిపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి, వేధింపులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గ కో–ఆర్డినేటర్ దయాల నవీన్ బాబు, నియోజకవర్గ పరిశీలకుడు బండి అబ్బులు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ, సర్పంచ్‌ల చాంబర్ జిల్లా ఉపాధ్యక్షురాలు గంజిమాల దేవి, మండల అధ్యక్షుడు రాఘవరాజు ఆదివిష్ణు, జగ్గవరపు జానకిరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Advertisement