నగదురహితం వైపు అడుగులు వేయండి
► గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేయండి
► ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
పెద్దపల్లి : దేశాన్ని డిజిటల్ యుగం వైపు తీసుకెళ్లాలని, దీనికోసం సర్పంచులు గ్రామస్థాయిలో నగదురహితంవైపు ప్రజలను అడుగులు వేయించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సూచించారు. పెద్దపల్లి అమర్‌చంద్ కలాణ మండపంలో జిల్లా సర్పంచ్‌లకు పలు అభివృద్ధి కార్యక్రమాలు, నగదు రహిత చెల్లింపులపై అవగాహన కల్పించారు. గ్రామస్థాయిలో నగదురహితం గురించి ఇంటింటా ప్రచారం నిర్వహించాలని కోరారు. సెల్‌ఫోన్ ద్వారా సైతం నగదు చెల్లింపులు కొనసాగేలా ప్రోత్సహించాలన్నారు. ప్రజాప్రతినిధిగా గ్రామాభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని కోరారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువయ్యేలా చూడాలన్నారు.
హరితహార కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న నీడనిచ్చే మొక్కలతోపాటు పండ్ల మొక్కలను పెంచేందుకు గ్రామస్తులకు అవగాహన కల్పించాలన్నారు. ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని నగదు రహితంతో బంగారు తెలంగాణగా మార్చుకుందామని అన్నారు. గ్రామాలను అభివృద్ధి పరుచుకునేందుకు నగదు రహితం చైతన్య కార్యక్రమంగా నిలుస్తుందన్నారు. ప్రజల్లో సంపూర్ణ అవగాహన కల్పించేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలని కోరారు. జిల్లా పంచాయతీ అధికారి సుదర్శన్, డీఆర్‌డీఏ పీడీ అంజయ్య సర్పంచ్‌లకు అవగాహన కల్పించారు.