పెద్దపల్లి: గెలుపు, ఓటములు శాసించేది వారే.. మరి టికెట్‌ దక్కెనా? | Karimnagar: Who Win Next Incumbent in Peddapalli Constituency | Sakshi
Sakshi News home page

పెద్దపల్లి: గెలుపు, ఓటములు శాసించేది వారే.. మరి టికెట్‌ దక్కెనా?

Published Fri, Aug 11 2023 6:32 PM | Last Updated on Tue, Aug 29 2023 10:53 AM

Karimnagar: Who Win Next Incumbent in Peddapalli Constituency - Sakshi

ఈ నియోజకవుర్గంలో పెద్దపల్లి అతిపెద్ద మండలంగా నిలుస్తుంది. పెద్దపల్లి గెలుపోవటములను శాసించేది కూడా ఇదే మండలం. ఈ మండల కేంద్రంలో అత్యధికంగా ముస్లిం మైనారిటీల ఓట్లు  ఉంటాయి. ముస్లిం మైనారిటీలు ఏ పార్టీకైతే ఓటు వేస్తారో ఆ పార్టీ విజయం సులభం అవుతుంది. 2009 నాటి నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం పెద్దపల్లి నియోజకవర్గంలో మొత్తం 6 మండలాలను ఏర్పడ్డాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 14 సార్లు సాధారణ ఎన్నికలు, ఒక ఉప ఎన్నిక జరిగాయి. కాంగ్రెస్ 6, టిడిపి 4, బీఆర్‌ఎస్‌ 2, బీజెపి 1, పీడీఎఫ్ 1, స్వతంత్య్ర అభ్యర్థి ఒకసారి గెలుపొందారు.   

 పెద్దపల్లి నియోజకవర్గంలో గెలుపు ఓటములను శాసించేది బీసీ ఓటర్లు. కానీ చాలా కాలం నుండి ఈ నియోజకవర్గ టికెట్‌ను బీసీలకు కేటాయించాలని అన్ని పార్టీల ఆశావాహుల నుండి ఒత్తిడి వస్తుంది. ఈసారి ఎన్నికల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి బీసీలకు టికెట్ కేటాయించాలని ఆయా పార్టీల అధిష్టానాలకు  ఒత్తిళ్లు వస్తున్నాయి.

బీసీలు : 70%
► ఎస్సీలు: 14%
► ఇతరులు: 16%

ఇక్కడ ఎప్పుడు హోరాహోరీ పోటే..! 

1983 ఎన్నికలు:

ఈ ఎన్నికలలో సంజయ్ విచార్ మంచ్ తరపున పోటీచేసిన గోనె ప్రకాష్ రావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గీట్ల ముకుందరెడ్డిపై విజయం సాధించారు. 1984లో గోనె ప్రకాష్ రావు రాజీనామా చేయుటతో 1984లో ఉప ఎన్నికలు జరిగాయి.

1984 ఉప ఎన్నికలు:

1983లో విజయం సాధించిన గోనె ప్రకాష్ రావు (సంజయ్ విచార్ మంచ్) రాజీనామా చేయుటంతో 1984లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గీట్ల ముకుందరెడ్డి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేముల రమణయ్యపై విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2009 ఎన్నికలు:

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయ రమణారావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన జి.ముకుందరెడ్డిపై 23,483 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున గుజ్జుల రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరఫున గీట్ల ముకుందరెడ్డి, ప్రజారాజ్యం పార్టీ నుండి వేముల పద్మావతి, లోక్సత్తా పార్టి తరఫున శ్రీనివాసరావు పోటీచేశారు.

2014 ఎన్నికలు:

2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన భానుప్రసాదరావుపై 62677 ఓట్ల మెజారిటితో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:

2018 ఎన్నికలలో తెరాస తరఫున దాసరి మనోహర్ రెడ్డి, భాజపా తరఫున గుజ్జుల రామకృష్ణారెడ్డి, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతకుంట విజయరమణారావు చేశారు. తెరాసకు చెందిన దాసరి మనోహర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతకుంట విజయరమణారావు పై 8,466 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఉపాధ్యాయుడి నుంచి ఎమ్మెల్యేగా..

దాసరి మనోహర్ రెడ్డి కరీంనగర్ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు కూడా. రాజకీయ నాయకుడ. ఈయన ట్రినిటీ  విద్యాసంస్థల అధినేతగానూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా కాసులపల్లి గ్రామానికి చెందిన మనోహర్ రెడ్డి ఎంఏ, బీఈడి వరకు అభ్యసించి ప్రారంభంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తర్వాత పలు విద్యాసంస్థలు స్థాపించి నిర్వహిస్తున్నారు. అతని తండ్రి పేరు రామ్ రెడ్డి. దాసరి ఒక వ్యవసాయ నేపథ్య కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చారు.

మనోహర్ రెడ్డి ఎమ్.ఎ, బి.ఎడ్ డిగ్రీని కలిగి ఉన్నారు. వ్యవసాయ వృత్తిలో ఉన్నప్పటికీ,సామాజిక సేవలో అతని ఆసక్తి రాజకీయాల్లోకి తన ప్రవేశానికి దారితీసింది. తెలంగాణ తరపున శాసనసభకు పోటీ చేసి గెలిచిన మొదటి వ్యక్తి దాసరి మనోహర్ రెడ్డి.  2009-11 కాలంలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2010లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించారు. 2014 శాసనసభ ఎన్నికలలో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెరాస తరపున పోటీచేసి విజయం సాధించారు.

దాసరి మనోహర్‌రెడ్డికి ఉన్న ప్రతికూల అంశాల

  • కలగా  మిగిలిన పెద్దపల్లి బస్సు డిపో
  • ఎస్సారెస్పి ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందకపోవడం.
  • పెద్దపల్లి, సుల్తానాబాద్ రాజీవ్ రహదారి నుండి పల్లెలకు వెళ్లే ప్రధాన రహదారుల సమస్య.
  • పేదలకు అందని ద్రాక్షల డబల్ బెడ్ రూమ్ ఇండ్లు.
  • మానేరు వాగు పై ఏర్పడ్డ ఇసుక రీచుల నుండి భారీగా ముడుపులు ముట్టినట్టు ఆరోపణలు.
  • నియోజకవర్గం లో జరిగే ప్రతి అభివృద్ధి పనిలో అన్ని తానై వ్యవహారిస్తారని, సర్పంచులు, ఎంపిటిసిలు, కౌన్సిలర్ల నిరుత్సాహం.
  • చెరువుల పూడికతీత పేరిట స్థానిక ఇటుక బట్టీలకు మట్టి అమ్ముకుంటున్నారని ఆరోపణలు.
  • తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులను పక్కన పెట్టి వలస నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నారని సీనియర్ నాయకుల అసంతృప్తి.
  • పెద్దపల్లి నియోజకవర్గం లోని రైస్ మిల్లుల నుండి విలువడే కాలుష్య నివారణ కు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
  • మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ ల  నిర్మాణంలో అవినీతి ఆరోపణలు.
  • రైస్ మిల్లు వద్ద ముడుపులు తీసుకుని తరుగు పేయుట కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెట్టిన పట్టించుకోలేదని అపవాదు.

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సానుకూల అంశాలు:

  • పెద్దపల్లి పట్టణంలో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయడం
  • పెద్దపల్లి పట్టణ సుందరీకరణ లో భాగంగా రోడ్ల విస్తరణ.
  • పెద్దపాలి పట్టణ ప్రజలకు త్రాగు నీటి సమస్య తీర్చడం.
  • సుల్తానాబాద్ పట్టణంలో మినీ స్టేడియం ఏర్పాటు.
  • ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయ అభివృద్ధి కి కృషి.
  • పెద్దపల్లి లో మాతా శిశు ఆసుపత్రి ఏర్పాటు.
  • సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అభివృద్ధి కి కృషి.

పెద్దపల్లి నియోజకవర్గంలో పోటీపడే ప్రధాన పార్టీల నాయకులు.

బీఆర్ఎస్ పార్టీ...

అధికార బిఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న దాసరి మనోహర్ రెడ్డికే మరోసారి అధిష్టానం టికెట్‌ ఇచ్చింది. 

కాంగ్రెస్ పార్టీ....

తెలుగుదేశం పార్టీ నుండి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండి బీసీలకు టికెట్ ఇవ్వాలంటూ నియోజకవర్గం లో విస్తృతంగా పర్యటిస్తున్న ఓదెల జడ్పిటిసి సభ్యుడు గంట రాములు, పెద్దపల్లి మాజీ జెడ్పిటిసి గతంలో డిసిసి అధ్యక్షులుగా ఉన్న ఈర్ల కొమురయ్య, తెలుగుదేశం పార్టీలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు సైతం కాంగ్రెస్ లో చేరి పార్టీ నుండి పోటీలో నిలిచే అవకాశం ఉంది.

భారతీయ జనతా పార్టీ....

బిజెపి పార్టీ నుండి తెలుగుదేశం అలయన్స్లో గెలిచిన మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, జాతీయ స్థాయి నాయకులతో మంచి సంబంధాలు కలిగిన దుగ్యాల ప్రదీప్ రావు, కాంగ్రెస్ పార్టీ నుండి ఇటీవలే బిజెపిలో చేరిన గొట్టముక్కుల సురేష్ రెడ్డి లు బిజెపి నుండి టికెట్ రేసులో ఉన్నారు.

బహుజన సమాజ్ పార్టీ...

ఇటీవల బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో బీఎస్పీలో చేరిన దాసరి ఉష ఇప్పటికే గ్రామస్థాయిలో పర్యటిస్తూ బూతు స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

భౌగోళిక పరిస్థితులు:

పెద్దపల్లి నియోజకవర్గం సరిహద్దుల నుండి మానేరు నది ప్రవహిస్తూ పంటలను సస్యశ్యామలం చేస్తుంది. ఇటీవల కాలంలో మానేరు నదిలో ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వడంతో స్థానిక రైతులు అధికార పార్టీపై వ్యతిరేక భావనతో ఉన్నారు.

► పెద్దపల్లి నియోజకవర్గానికి మరో వైపు రామగిరి పర్వతాలు మంచి పర్యాటక కేంద్రాలుగా గుర్తింపు కలిగి ఉన్నాయి.

► సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీ భ్రమరాంబ సమేత ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం భక్తులకు కొంగుబంగారంగా నిలుస్తోంది.

► నియోజకవర్గంలో ప్రసిద్ధిగాంచిన సబితం జలపాతం (వాటర్ ఫాల్స్) పర్యాటకులను ఆకర్షిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement