శిక్షణ ఇవ్వకుండానే స్వాహా
శిక్షణ ఇవ్వకుండానే స్వాహా
Published Tue, Jul 19 2016 10:59 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
చా ట్రాయి :
శిక్షణ ఇస్తామంటూ నిరుద్యోగులను చేర్చుకుని, వారికి ఎటువంటి శిక్షణ ఇవ్వకుండా, వారి బ్యాంక్ అకౌంట్‌లో సై్టఫండ్ జమచేసి, ఆ తరువాత ఆ నగదులో అధిక మొత్తం డ్రాచేసుకున్న ఘటన మండలంలోని చిత్తపూరు గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. తాము మోసపోయిన విషయాన్ని నిరుద్యోగులు ఎంపీడీవో వి.లలితకుమారి దృష్టికి తీసుకెళ్లారు. బాధితుల కథనం మేరకు.. ప్రధాన మంత్రి కౌసల్య వికాస్ యోజన కింద నిరుద్యోగులకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇప్పిస్తామంటూ కర్ణాటకు చెందిన స్వచ్ఛంద సంస్థ శ్రీ టెక్నాలజీస్ మండలంలోని చిత్తపూరులో 300 మంది నిరుద్యోగులను చేర్చుకుంది. వారంతా 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులు. హైదరాబాద్‌కు చెందిన సునీల్ ముసులూరి ఆ సంస్థలో మేనేజింగ్ పార్టనర్ వ్యవహరిస్తూ నిరుద్యోగులను చేర్చుకున్నారు. శిక్షణ కాలంలో నెలకు రూ.7500 చొప్పున సై్టఫండ్ ఇవ్వడంతోపాటు సర్టిఫికెట్లు జారీ చేసి, ఉపాధి కల్పిస్తామని నమ్మించారు. నిరుద్యోగుల నుంచి ఆధార్, రేషన్ కార్డులు, విద్యార్హత సర్టిఫికెట్లు, ఫోన్ నంబర్లు తీసుకున్నారు. అదే సమయంలో అభ్యర్థులతో క్రెడిట్, డెబిట్ కార్డులు ఇప్పిస్తామంటూ బ్యాంకు ఫారాలపై సంతకాలు చేయించారు.
శిక్షణ ఇవ్వకుండానే...
సంతకాలు తీసుకుని రోజులు గడిచినా శిక్షణ ప్రారంభించకపోవడంతో నిరుద్యోగులు ఏజెన్సీ నిర్వాహకులను ఫోన్‌లో సంప్రదిం చగా శిక్షణ లేకుండా సర్టిఫికెట్లు ఇస్తామని, సై్టఫండ్ వారి ఖాతాల్లో జమచేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఖాతాల్లో నగదు జమచేశామని ఏజెన్సీ ప్రతినిధులు చెప్పడంతో 20 మంది నిరుద్యోగులు కామవరపుకోట ఏటీఎంలో సరిచూసుకోగా రూ.6,900 చొప్పున ప్రతి ఖాతా నుంచి నగదు విత్‌డ్రాచేసినట్లు వెల్లడైంది. దీంతో నిరుద్యోగులు బి.శ్రీకాంత్, బత్తుల సత్యనారాయణ, పి.రమేష్ తదితరులు మంగళవారం ఎంపీడీవో లలితకుమారిని ఆశ్రయించారు. ఈ విషయంపై సంస్థ నిర్వాహకులను ఎంపీడీవో ఫోన్‌లో సంప్రదించగా తమ ప్రతినిధులు చిత్తపూరు వచ్చి నిరుద్యోగులకు న్యాయం చేస్తామని వారు బదులిచ్చారు. తమకు జరిగిన మోసాన్ని ఇతరులకు జరగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
Advertisement
Advertisement