ఆవేశం మానుకో.. ప్రాణం నిలబెట్టుకో..
-
ఆత్మహత్యలతో కుటుంబాలను ఆగం చేయెుద్దు
-
సమస్యలకు చావే ముఖ్యం కాదు
-
చనిపోయి కాదు.. బతికి సాధించాలంటున్న మానసిక వైద్యులు
-
నేడు ప్రపంచ ఆత్మహత్యల వ్యతిరేక దినం
నేటి సమాజంలో చాలామంది చిన్నచిన్న సమస్యలకే తడబడిపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు.. పంటల సాగుకు పెట్టిన పెట్టుబడులు రాక అన్నదాతలు.. పరీక్షల్లో ఫెయిలైనందుకు విద్యార్థులు.. కుటుంబకలహాలతో కొందరు.. వ్యాధులబారి నుంచి ఉపశమనం పొందలేమనే ఆవేదనతో ఇంకొందరు.. ఇలా అనేకమంది అనేక కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా వారినే నమ్ముకుని, వారిపైనే ఆశలు పెట్టుకుని జీవించే కుటుంబసభ్యులు రోడ్డున పడుతున్నారు. బతికినంతకాలం వారినే గుర్తుకు చేసుకుంటూ తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో క్షణికావేశాలతో విలువైన ప్రాణాలను తీసుకోవద్దని.. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటే పరిష్కారం తప్పక లభిస్తుందని మాన సిక వైద్యులు చెబుతున్నారు. నేడు ప్రపంచ ఆత్మహత్యల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కథనం.
ఆత్మసై్థర్యం నింపుతున్న ‘ఆరోగ్యమిత్ర’
మహబూబాబాద్ : సమాజంలో మనిషి జీవితం చాలా విలువైనది. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి వ్యక్తి అనుసరించే విధానాలు, ఆయన చేసే మంచి పనులు చిరకాలం గుర్తుండిపోతాయి. అయితే జీవిత ప్రయాణంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను కూడా ఎదుర్కొనే ధైర్యంలేక చాలా మంది అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆత్మహత్యలు వద్దు.. ఆలోచనే ముద్దు’ అనే నినాదంతో మానుకోటకు చెందిన హోమియో పతి డాక్టర్ పరికిపండ్ల అశోక్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆరోగ్యమిత్ర స్వచ్ఛంద సంస్థ మానసిక వేదనకు గురవుతున్న వారిని చైతన్యపరుస్తూ వారిలో ఆత్మసై్థర్యం నింపుతోంది. అశోక్ వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ ప్రవృత్తిగా ఆయన సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతూSగుర్తింపు పొందుతున్నారు.
ఏటా 1500 మంది మరణం..
ఆరోగ్యమిత్ర సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం జిల్లాలో ఏటా 1500 మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఒక్క 2010లోనే 1610 మంది బలవన్మరణాలు పొందినట్లు పోలీస్ రికార్డుల్లో పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా మానసిక ఒత్తిడులు, క్షణికావేశాలు, అప్పులబాధలు, ఆకలి, విఫలమైన ప్రేమలు, కుటుంబకలహాలతో చనిపోయినట్లు తెలిసింది. రోడ్డు ప్రమాదాల కంటే ఆత్మహత్యలు చేసుకుంటున్న వారే ఎక్కువగా ఉంటున్నట్లు ఆరోగ్యమిత్ర సర్వేలో వెలుగుచూసింది. ఆత్మహత్యల జాబితాలో మనదేశం ప్రపంచంలో ముందు వరుసలో ఉందని తెలుస్తోంది. మానుకోట మండలం ఉత్తర తండాలో ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉందని ఆరోగ్య మిత్ర సంస్థ సభ్యులు గుర్తించారు.
అవగాహన లోపంతోనే...
ఆత్మహత్యలు చేసుకునే వారిలో 30 ఏళ్ల వయస్సు ఉన్నవారే 50 శాతం ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. విద్యార్థులు, యువకులు తాము అనుకున్న లక్ష్యాలను సాధించలేనప్పుడు క్షణికావేశంలో తనువు చాలిస్తున్నారు. ఆత్మహ్యతల విషయంలో మనదేశంలో కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. వరంగల్ నగరంలో మూడేళ్లుగా ఆత్మహత్యల సంఖ్య తగ్గుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ చనిపోయిన వారిలో యువత ఎక్కువగా ఉంటుండడం గమనార్హం.
ఆరేళ్లుగా కౌన్సిలింగ్
డాక్టర్ పరికిపండ్ల అశోక్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆరోగ్యమిత్ర సంస్థ 20 ఏళ్ల క్రితం ఏర్పాటైంది. ఇందులో 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, 126 మంది సభ్యులు ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలోని పలు ప్రాంతాలను సంస్థ సభ్యులు సందర్శిస్తూ ఆత్మహత్యలు చేసుకుందామని ఆలోచిస్తున్న వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఏటా సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 10 వరకు నెల రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తూ మనోవేదనతో సతమతమవుతున్న వారిని చేరదీసి ప్రాణం విలువ, కుటుంబ సంరక్షణపై అవగాహన కల్పిస్తూ ధైర్యం నింపుతున్నారు. గత ఆరేళ్ల కాలంలో ఆత్మహత్యకు ప్రయత్నం చేసిన 8 మందిని సంస్థ బాధ్యులు కాపాడారు. ఇందులో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఒక ప్రైవేట్ టీచర్, ఇద్దరు విద్యార్థులు, ఇద్దరు రైతులు, ఒక వృద్ధురాలు ఉన్నారు. కాగా, ఆత్మహత్యలను నివారించేందుకు కరపత్రాలు, వాల్‌పోస్టర్లు ముద్రించి ప్రచారం చేస్తుండడంతోపాటు గ్రామాల్లో అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు.
ధైర్యం కోల్పోవద్దు
ధైర్యం కోల్పోవడంతోనే ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచన కలుగుతుంది. క్షణికావేశానికి గురై నిర్ణయాలు తీసుకోవద్దు. ఆత్మహత్యల నివారణ కోసం తమ సంస్థ కృషి చేస్తోంది. సంస్థ ఆధ్వర్యంలో చాలా మందికి కౌన్సిలింగ్ నిర్వహించాం. సమస్య ఎదురైనప్పుడు ఆత్మహత్య వైపు చూడకుండా పరిష్కారం మార్గం వైపు ఆలోచించాలి.
–డాక్టర్ పరికిపండ్ల అశోక్, ఆరోగ్యమిత్ర స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు