
విషాహారంతో చనిపోయిన వీధి కుక్కలు
విషం పెట్టి చంపిన గ్రామపంచాయతీ కార్మికులు
ఊహించని స్థితిలో ఓ పెంపుడు కుక్క మృతి
తట్టుకోలేక తల్లడిల్లుతూ రోదించిన చిన్నారులు
వారిని చూసి గ్రామస్తుల కంటతడి
మెదక్: ఊర కుక్కలు దాడులు చేసి ప్రజలను గాయపరుస్తున్నాయని ఆ గ్రామస్తులంతా తీర్మానించి విషంతో వాటిని చంపించారు. అందులో ఓ పెంపుడు కుక్క సైతం మృతి చెందడంతో పదేళ్లలోపు అక్కా తమ్ముళ్లు నాలుగు గంటలపాటు రోదించారు. ఈ ఘటన మండల పరిధిలోని ముత్తాయికోట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.
ముత్తాయికోట గ్రామంలో కొన్ని రోజులుగా సుమారు 300మంది గ్రామస్తులను వీధి కుక్కలు తీవ్రంగా కరిచి గాయపర్చాయి. దీంతో ఇటీవల గ్రామ పంచాయతీ ఊర కుక్కలను చంపేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసింది. అందులో భాగంగానే గురువారం సుమారు 150 కుక్కలకు విషం పెట్టి చంపారు.
ఇందులో గ్రామానికి చెందిన మూడబోయిన కృష్ణ పెంపుడు కుక్క సైతం మృతి చెందింది. కృష్ణ పిల్లలు భవాని, భవాని ప్రసాద్‌లు ఆ పెంపుడు కుక్కను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అది లేనిదే ఒక్క క్షణం కూడా ఉండలేని ఆ చిన్నారులు కుక్క చనిపోయిన విషయం తెలుసుకొని సుమారు 4గంటలపాటు రోదించారు.
వారి రోదనలు ఆపడం ఎవరితరం కాలేదు. వారిని చూసిన గ్రామస్తులు సైతం కంటతడి పెట్టకుండా ఉండలేకపోయారు. విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన పెంపుడు కుక్కతో ఆ చిన్నారులిద్దరూ అత్యంత ఆప్యాయంగా ఉండేవారని ఆ కుటుంబీకులు తెలిపారు.