గ్రూపు–3 పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
గ్రూపు–3 పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
Published Sat, Apr 22 2017 12:22 AM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM
రేపు 176 కేంద్రాల్లో పరీక్ష
– హాజరు కానున్న 56,076 మంది అభ్యర్థులు
– ఓఎంఆర్ షీటులో అభ్యర్థుల పూర్తి వివరాలు
– వైట్నర్ వాడితే 1/3 మైనస్ మార్కులు
కర్నూలు(అగ్రికల్చర్): ఏపీపీఎస్‌సీ గ్రూపు–3 ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 23న నిర్వహించనున్నారు. మొత్తం 56,076 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. గ్రూపు-3 పోçస్టులు జిల్లాలో 86 ఉండగా ఒక్కో పోస్టుకు 652 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ పరీక్షలో ఏపీపీఎస్‌సీ కొన్ని కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది. ఓఎంఆర్ షీట్‌లో మొదటి సారిగా అభ్యర్థి పేరు ఇతర వివరాలన్నీ ముద్రించారు. 1/3 మైనస్ మార్కులు కూడా పెట్టారు. ఓఎంఆర్ షీట్‌లో వైట్నర్‌తో ఎట్టి పరిస్థితుల్లో వాడరాదు. అభ్యర్థులు పొరపాటున వైట్నర్‌ను మూడు సార్లు వాడితే అభ్యర్థికి వచ్చే మొత్తం మార్కుల్లో ఒక మార్కు తగ్గిస్తారు. పరీక్ష నిర్వహణకు జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. కర్నూలు, కల్లూరుతో పాటు పాణ్యం, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్, నందికొట్కూరు, ఎమ్మిగనూరులో మొత్తం 176 సెంటర్లు ఏర్పాటయ్యాయి. పరీక్ష ఉదయం 10 నుంచి 12.30 వరకు జరుగుతుంది. పరీక్ష నిర్వహణకు జాయింట్ కలెక్టర్ హరికిరణ్ కో–ఆర్డినేటర్‌గా.. 11 మంది డిప్యూటీ కలెక్టర్లు అసిస్టెంట్ కో–ఆర్డినేటింగ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. 44 మంది తహసీల్దార్లు లైజన్ ఆఫీసర్లుగా ఉంటారు.
అవగాహన సదస్సు
ఏపీపీఎస్‌సీ గ్రూపు–3 పరీక్షను పురస్కరించుకొని, అసిస్టెంట్ కో– ఆర్డినేటింగ్ అధికారులు, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్, అసిస్టెంటు లైజన్ అధికారులకు శుక్రవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఏపీపీఎస్‌సీ సీనియర్ సెక‌్షన్ ఆఫీసర్ సి.వి.రమణ, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణలు పరీక్ష నిర్వహణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కర్నూలు, నంద్యాల ఆర్‌డీఓలు హుసేన్‌సాహెబ్, రాంసుందర్‌రెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Advertisement