కంచాలతో విద్యార్థుల ఆందోళన
కంచాలతో విద్యార్థుల ఆందోళన
Published Sat, Aug 6 2016 8:00 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
హాస్టళ్లు, పాఠశాలల మూసివేతను..
విరమించుకోవాలని డిమాండ్
కలెక్టరేట్ ఎదుట నవ్యాంధ్ర
విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా
గుంటూరు ఎడ్యుకేషన్ : సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు నిరసనగా నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ, ఏపీ గిరిజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా నిర్వహించారు. హాస్టళ్లను మూసివేసి విద్యార్థుల పొట్ట కొట్టవద్దని ఖాళీ కంచాలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.అయ్యస్వామి మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో సంక్షేమ హాస్టళ్లు మూసివేయడాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పాఠశాలలను మూసివేసిన ప్రభుత్వం, గురుకులాల పేరుతో హాస్టళ్ల మూసివేతకు ఉపక్రమించిందని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లక్షలాది రూపాయల వేతనాలు పెంచుకుంటున్న ప్రభుత్వం అర్ధాకలితో అలమటిస్తున్న విద్యార్థులకు మెస్ చార్జీల పెంపుదలపై దష్టి సారించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కె.పాండు నాయక్ మాట్లాడుతూ గిరిజన హాస్టళ్ల మూసివేతతో నిరుపేద గిరిజన విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తోందని ఆరోపించారు. సంక్షేమ హాస్టళ్లలో పూర్తిస్థాయి వసతులు కల్పించి, విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన నాణ్యమైన విద్య అందించాల్సిన ప్రభుత్వం, హాస్టళ్ల నిర్వహణను ఆర్థిక భారంగా పరిగణించడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
కలెక్టర్ దృష్టికి సమస్యలు..
కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న సమయంలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే బయటకు వెళ్లేందుకు తన వాహనంలో అక్కడకు వచ్చారు. దీంతో విద్యార్థి నాయకులు కలెక్టర్ వాహనాన్ని ఆపి హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ధర్నాలో విద్యార్థి జేఏసీ జిల్లా అధ్యక్షుడు కుర్రం శ్రీనివాస్, దాసరి వంశీ, సతీష్, విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement